Telugu Global
Telangana

వరంగల్ సీటు కోసం పోటీ.. బీఆర్ఎస్ అధిష్టానానికి వినతులు

వరంగల్‌ లోక్‌సభ స్థానంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం నేతలు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం అందించారు.

వరంగల్ సీటు కోసం పోటీ.. బీఆర్ఎస్ అధిష్టానానికి వినతులు
X

వరంగల్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ టికెట్ వద్దనుకున్న కడియం కావ్య స్థానంలో ఇప్పుడు తెరపైకి ఎవరు వస్తున్నారనే విషయం చర్చనీయాంశం అవుతోంది. ఈ సిట్టింగ్ స్థానం ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. కడియం కావ్య కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడం ఖాయం కావడంతో.. ఇక్కడ పార్టీకి బలముందా, కడియం కావ్యకు బీఆర్ఎస్ ని మించి అనుచరగణం ఉందా అనేది తేల్చుకోవాల్సిన సందర్భం. అందుకే బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వరంగల్ టికెట్ కోసం గట్టిపోటీ ఉండటం కూడా విశేషం.

వాస్తవానికి కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఇవ్వడాన్ని గతంలోనే చాలామంది వ్యతిరేకించారు. రెండుసార్లు వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్న పసునూరి దయాకర్.. పార్టీతో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ టికెట్ ఆయనకు దాదాపు ఖాయం అనుకున్న టైమ్ లో కావ్య ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు పసునూరికి కాంగ్రెస్ టికెట్ లేదు. మరి ఆయన వెనక్కు వచ్చేస్తారేమో చూడాలి. కడియంతో విభేదాలతో బీఆర్ఎస్ ని వీడిన మాజీ మంత్రి తాటికొండ రాజయ్యకు కూడా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ.. వారిని వెనక్కు పిలవడం ఇష్టం లేకపోతే కొత్త అభ్యర్థివైపు బీఆర్ఎస్ మొగ్గు చూపాల్సి ఉంటుంది.

వరంగల్‌ లోక్‌సభ స్థానంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం నేతలు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం అందించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. వరంగల్‌ సీటు వంగపల్లికి ఇస్తే మాదిగలంతా ఏకమై గెలిపించుకుంటామని తెలిపారు.

ఇటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న కూడా రేస్ లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగి పుల్లా శ్రీను కూడా బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో హడావిడి పడాలనుకోవట్లేదు. కడియం కావ్యను ఓడించే బలమైన అభ్యర్థికోసం వెదుకుతోంది.

First Published:  5 April 2024 5:45 AM IST
Next Story