సమగ్ర కుల సర్వేకు అందరు సహకరించాలి
పార్టీలు రాజకీయ కోణంలో చూడొద్దు : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల సర్వేకు అందరూ సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. పార్టీలు రాజకీయ కోణంలో సర్వేను చూడొద్దన్నారు. బీసీ కమిషన్ కు సొంతగా అధికారయంత్రాంగం లేనందునే ఈ సర్వేను ఏదో ఒక ప్రభుత్వ శాఖకు అప్పగించాలని కోరామని.. తమ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ కు సర్వే బాధ్యత అప్పగించిందన్నారు. ఎన్యూమరేటర్లు ఏ రోజు ఏ ఇంటికి వస్తారో ముందుగానే ఆయా కుటుంబాలకు సమాచారం ఇస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్ల ద్వారా సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్వే అత్యంత కీలకమని.. భవిష్యత్ లో కల్పించబోయే పథకాలకు దీనిని ప్రమాణికంగా తీసుకుంటారన్నారు. ప్రజలు ఈ విషయం గమనించి ఎన్యూమరేటర్లకు అన్నిరకాల సహకరించాలని కోరారు. ఎక్కడ ఏదైనా లోపాలు జరిగితే ప్రజలు ఇచ్చిన సమాచారం దుర్వినియోగం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. సరైన సమాచారం ఇవ్వడం పౌరుల బాధ్యత అన్నారు. ఎన్యూమరేటర్లు ఎక్కడ ఏదైనా తప్పుడు సమాచారం నమోదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రెస్‌మీట్ లో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.