Telugu Global
Telangana

రైల్వే ప్రయాణికులూ అలర్ట్.. ఆ రైళ్లు వారం రోజులు బంద్

అధికారులు ప్రకటించిన ఆయా మార్గాల్లో రోజూ కనీసం 30 వేల మందికి పైగా రాకపోకలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లంతా ఈనెల 14 నుంచి 20 వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

రైల్వే ప్రయాణికులూ అలర్ట్.. ఆ రైళ్లు వారం రోజులు బంద్
X

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడి నిత్యం రాకపోకలు చేసేవారి కోసమే ఈ న్యూస్. ఈనెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు.. హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో 22 ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

లింగంపల్లి - హైదరాబాద్, ఫలక్‌నుమా - లింగంపల్లి, ఫలక్‌నుమా - రామచంద్రాపురం, లింగంపల్లి - ఉందానగర్ మధ్య తిరిగే 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం పాటు నిలిపేస్తున్నట్టు తమ ప్రకటనలో తెలియజేశారు. ఈ రూట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకే రైళ్లు రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.

వారం పాటు ఎంఎంటీఎస్ రైళ్ల నిలుపుదల నిర్ణయం.. రేపటి సోమవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారులు ప్రకటించిన ఆయా మార్గాల్లో రోజూ కనీసం 30 వేల మందికి పైగా రాకపోకలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లంతా ఈనెల 14 నుంచి 20 వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

టికెట్ ధర తక్కువగా ఉండడం.. ప్రయాణ సమయం కూడా త్వరగా పూర్తవడం వంటి కారణాలతో చాలా మంది ఉద్యోగులు, కార్మికులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడుతున్నారు. వారం రోజుల పాటు ఆ సేవలు అందుబాటులో ఉండకపోవడంపై వాళ్లంతా రైల్వే అధికారులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా తమకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

First Published:  13 Aug 2023 6:37 AM GMT
Next Story