Telugu Global
Telangana

రాష్ట్రంలో మద్యం ధరల పెంపు!

ధరల పెంపుతో సర్కారుకు ప్రతి నెల వెయ్యి కోట్ల అదనపు ఆదాయం.మద్యం ధరలను సవరించే దిశలో ఆబ్కారీ శాఖ కసరత్తు!

రాష్ట్రంలో మద్యం ధరల పెంపు!
X

కేసీఆర్‌ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చారని సీఎం రేవంత్‌ సహా ఆపార్టీ నేతలు విమర్శించారు. సీఎం రేవంత్‌ నిత్యం కేసీఆర్‌పై నిత్యం వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. అసెంబ్లీ వేదికగా తాగుతారు (చేయితో చూపిస్తూ) అన్నట్టు విమర్శించారు. తాను వస్తే రాష్ట్రంలో మద్య పాన నిషేధం విధిస్తాను.. లిక్కర్‌ ఫ్రీ రాష్ట్రంగా మారుస్తాన్నట్టు అన్నట్టు రేవంత్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి ఆ మాటకు కట్టుబడి ఉంటారా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి, రాష్ట్ర ఖజానా లోటును భర్తీ చేయడానికి ఎక్సైజ్‌ శాఖపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారా? అని ఎవరైనా అనుకుంటే సీఎం తాగకుండానే 'కిక్‌ ' ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. కాంగ్రెస్‌ అంటేనే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నది పది నెలల కాలంలో ప్రజలకు తెలిసిపోయింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై ధరలు పెంచాలని చూస్తున్నది. అభివృద్ధిలో తాము ప్రపంచంతో పోటీ పడుతామన్న సీఎం రేవంత్‌ మద్యం ధర విషయంలో పక్క రాష్ట్రాన్ని అనుసరించాలని నిర్ణయించారు. అక్కడి ధరలను రాష్ట్రంలో సమం చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు రాబడులను పెంచుకోవడానికి కఠినంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఆబ్కారీ అధికారులు మందుబాబులకు షాక్‌ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం మేలో బీరుపై రూ. 10 రూపాయలు, లిక్కర్‌పై 20 రూపాయలు తగ్గించిన దాన్ని కలుపుకోవడమే కాకుండా మరింత జోడించి మద్యం ద్వారానే రాష్ట్రానికి నెల నెలా వెయ్యి కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని యోచిస్తున్నది.

రాష్ట్రంలో మద్యం ధరలు సవరించే దిశగా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తున్నది. ఏపీలో మద్యం ధరలకు సమం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీరుపై రూ. 20, లిక్కర్‌పై తక్కువలో తక్కువ క్వార్టర్‌ నుంచి రూ. 20-70 వరకు పెంపు ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ధరల పెంపుతో అదనంగా రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదని సర్కారు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్సైజ్‌ శాఖ నుంచి ఆశించినస్థాయిలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యాట్‌, ఎక్సైజ్‌డ్యూటీల ద్వారా రూ. 36 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ -సెప్టెంబర్‌ వరకు ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ. 9,493 కోట్లు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. వ్యాట్‌ ద్వారా మరో రూ. 8,040 కోట్లు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన ఆరు నెలల్లో అంతేమొత్తం వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 35 వేల కోట్లకు మించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇటీవలే వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. రాబడులను పెంచుకోవడానికి కఠినంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు విమర్శలు రావడంతో గత ప్రభుత్వం మేలో బీరుపై రూ. 10 రూపాయలు, లిక్కర్‌పై 20 రూపాయలు తగ్గించింది. ఆదాయం తగ్గుతుండటంతో గతంలో ప్రభుత్వం తగ్గించిన ధరలతో పాటు మరికొంత అదనంగా చేర్చి పెంచే యోచనలో ఆబ్కారీ శాఖ ఉన్నది. ఈ నేపథ్యంలో వీలైనంత ధరలు పెంచాలని ఎక్సైజ్‌ శాఖ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో ఫుల్‌ బాటిల్‌ పై రూ. 80 నుంచి 300 వరకు పెంచాలని యోచిస్తున్నది. అంటే ఇప్పుడున్న ధరల కంటే 15-20 శాతానికి పైగా ధరలు పెరిగే అవకాశం ఉన్నది.

First Published:  1 Nov 2024 2:11 PM IST
Next Story