అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. నెగ్గిన చల్లా పంతం..!
ఈ విషయంలో ఎమ్మెల్సీ చల్లా వర్గం పంతం నెగ్గినట్లు తెలుస్తోంది. నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థి మార్పుపై గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మొదటి జాబితాలోనే ప్రకటించారు సీఎం కేసీఆర్. కాగా, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం అభ్యంతరం తెలపడంతో ఆయకు ఇప్పటివరకూ బీఫామ్ ఇవ్వలేదు. అభ్యర్థిని తప్పనిసరిగా మార్చాల్సిందేనని చల్లా వర్గం పట్టుబట్టడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది.
తాజాగా ఈ విషయంలో ఎమ్మెల్సీ చల్లా వర్గం పంతం నెగ్గినట్లు తెలుస్తోంది. నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థి మార్పుపై గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజయుడికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. విజయుడి గెలుపు బాధ్యత తనదేనని చల్లా వెంకట్రామిరెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇవాళ అభ్యర్థి మార్పుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థలను ఫైనల్ చేశారు గులాబీ బాస్. దాదాపు అందరికీ బీ ఫామ్‌లు సైతం అందజేశారు. బీఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గోషామహల్ రేసులో పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి, కాసాని పేర్లు వినిపిస్తున్నాయి.