ఆర్ఎస్ఎస్ టిల్లు రేవంత్.. అక్బరుద్దీన్ సెటైర్లు
రేవంత్ రెడ్డి ముందు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని.. అందుకే ఆయన్ను ఆర్ఎస్ఎస్ టిల్లు అని పిలుస్తానని చెప్పారు అక్బరుద్దీన్ ఒవైసీ.
రేవంత్ రెడ్డి హైటెంత..? ఆయన మాట్లాడే మాటలేంటి అంటూ ఎద్దేవా చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. ఈరోజు నుంచి ఆయనకు కొత్తపేరు పెడుతున్నానని, ఆయన ఆర్ఎస్ఎస్ టిల్లు అని కౌంటర్ ఇచ్చారు. చాంద్రాయణ గుట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్.. రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. తమజోలికొస్తే ఆయన జీవిత చరిత్ర మొత్తం బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ముందు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని.. అందుకే ఆయన్ను ఆర్ఎస్ఎస్ టిల్లు అని పిలుస్తానని చెప్పారు అక్బరుద్దీన్ ఒవైసీ. ఇప్పటి వరకు భారత దేశంలో హిందూ- ముస్లిం గొడవలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 55 మతపరమైన గొడవలకు కారణం కాంగ్రెస్సేనన్నారు. దేశ విభజనకు కారణం నెహ్రూ అని అన్నారు. ఆయన వల్లనే భారత్-పాకిస్తాన్ రెండు భాగాలు అయ్యాయని చెప్పారు. లేకపోతే మనకి ఒకే దేశం ఉండేదన్నారు అక్బరుద్దీన్.
మమ్మల్ని రెచ్చగొట్టొద్దు..
తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసులు పెట్టారని, తనను నిజామాబాద్ జైలులో ఉంచారని, చివరికి తన కుటుంబ సభ్యులను కూడా కలవనీయలేదని.. వీటన్నిటికీ కారణం కాంగ్రెస్సేనని అన్నారు అక్బరుద్దీన్. తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఇటీవల రేవంత్ రెడ్డి, ఎంఐఎంపై చేసిన విమర్శలకు అక్బరుద్దీన్ బదులిచ్చారు.