Telugu Global
Telangana

వరంగల్, పెద్దపల్లిలో ఎయిర్‌పోర్టులు.. కేంద్రానికి నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

రెండు ఎయిర్‌పోర్టులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

వరంగల్, పెద్దపల్లిలో ఎయిర్‌పోర్టులు.. కేంద్రానికి నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
X

తెలంగాణలో వాణిజ్య అవసరాల కోసం కేవలం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో చెబుతోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కూడా నివేదించింది. ఈ క్రమంలో వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు ఒక అడుగు ముందుకు పడింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా వరంగల్ సమీపంలోని మామనూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించడానికి మార్గం సుగమం అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం 2016లో ఉడాన్ అనే పథకాన్ని తీసుకొని వచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు విమాన ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. నగరాలు, రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానితో ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ఉడాన్ పథకం ద్వారా విమానాశ్రయాలను నిర్మిస్తున్నారు. వరంగల్ సమీపంలోని మామనూరు ఎయిర్‌పోర్టు నుంచి 1970-77 మధ్య వాయుదూత్ విమానాలను నడిపించారు. బసంత్ నగర్ ఎయిర్ పోర్టు 1975-82 మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉండేది. అయితే విమానాశ్రయం నిర్వహణ, ప్రయాణ ఖర్చు భారంగా మారడంతో ప్రభుత్వం ఈ రెండు విమానాశ్రయాలను మూసేసింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరోసారి చిన్న విమానాశ్రయాల ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, ప్లానింగ్ కమిషన్ బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి‌ని ఢిల్లీలో కలసి.. తెలంగాణలో ఆరు మినీ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ క్రమంలో మామనూరు, బసంత్‌నగర్ ప్రాంతాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి డీపీఆర్‌లు సమర్పించాలని, ఇక్కడ వచ్చే అత్యధిక వరద లెక్కలను కూడా ఇవ్వాలని ఆదేశించారు.

మామనూరులో ప్రస్తుతం 750 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. చుట్టుపక్కల ఉన్న నక్కలపల్లి, గడేపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఉంది. అవసరం అయితే ప్రభుత్వం ఆ భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన 40 ఎకరాల భూమి అందుబాటులో ఉందని.. మరో 700 ఎకరాల భూమిని సేకరించి ఇస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన భూమి పాలకుర్తి, కుర్మన్‌పల్లి, బసంత్‌నగర్, రాగినేడు గ్రామాల పరిధిలో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం నివేదికలో తెలిపింది.

రెండు ఎయిర్‌పోర్టులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండు ఎయిర్ పోర్టులను నిర్మించడం ద్వారా ఏయే ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ వస్తుందో కూడా చెప్పింది. ఉమ్మడి వరంగల్, కరీంగనగర్ జిల్లాల్లోని రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామగిరి ఖిల్లా, కాళేశ్వరం, భద్రకాళి టెంపుల్, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ దేవాలయాలకు టూరిజం పెరుగుతుందని పేర్కొన్నది. అందే కాకుండా అదిలాబాద్‌ టైగర్ రిజర్వ్, గోదావరి పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందుతుందని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది.

First Published:  16 Sept 2022 8:25 AM IST
Next Story