Telugu Global
Telangana

ఎల్ అండ్ టీ చేతికి ఎయిర్ పోర్ట్ మెట్రో పనులు? టెండర్ దక్కించుకున్న సంస్థ!

ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ తదితర విషయాల్లో ఎల్ అండ్ టీకి ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఆ సంస్థకే నిర్మాణ పనులను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఎల్ అండ్ టీ చేతికి ఎయిర్ పోర్ట్ మెట్రో పనులు? టెండర్ దక్కించుకున్న సంస్థ!
X

తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులకు టెండర్లు ఖరారు అయినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ మెట్రోను నిర్మించిన దిగ్దజ ఇన్‌ఫ్రా కంపెనీ ఎల్ అండ్ టీనే.. ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుల టెండర్లు కూడా దక్కించుకున్నట్లు సమాచారం. విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లు పిలవగా.. రెండో దశకు ఎల్ అండ్ టీ లిమిటెడ్, ఎన్‌సీసీ లిమిటెడ్ మాత్రమే అర్హత సాధించాయి. ఈ రెండు కంపెనీల అనుభవం, సాంకేతిక, ఆర్థిక నివేదికలను మెట్రో అధికారులు, జనరల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కలిసి పరిశీలించారు.

ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ నిబంధనలకు ఎల్ అండ్ టీ సంస్థ అర్హత సరి పోలినట్లు తెలుస్తున్నది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ తదితర విషయాల్లో ఎల్ అండ్ టీకి ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఆ సంస్థకే నిర్మాణ పనులను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే మెట్రో అధికారులు ఎల్ అండ్ టీకి టెండర్ కేటాయించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అధికారికంగా ఎల్ అండ్ టీ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మించాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,250 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ మెట్రోకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించనున్నది. ఈపీసీ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇటీవలే గ్లోబల్ టెండర్లు పిలిచింది. జనరల్ కన్సల్టింగ్ వ్యయం, ఆకస్మిక వ్యయం, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ వంటివి మినహాయించి రూ.5,566 కోట్లకు టెండర్లు పిలిచింది.

ఎల్ అండ్ టీ సంస్థ హైదరాబాద్‌లో మెట్రో మొదటి దశనే కాకుండా దేశంలోని వేర్వేరు నగరాల్లో మెట్రోలు నిర్మించిన అనుభవం ఉంది. అయితే ఈ సంస్థతో పాటు బెంగళూరు ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మించిన ఎన్‌సీసీ సంస్థ పోటీ పడింది. చివరకు ఈ టెండర్‌ను ఎల్ అండ్ టీ దక్కించుకున్నది.

First Published:  10 Aug 2023 8:56 AM GMT
Next Story