రాహుల్ ని కలవాల్సింది నాయకులు కాదు, ప్రజలు..
నాయకులెవరూ జోడో యాత్రలో రాహుల్ ని కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పారు కేసీ వేణుగోపాల్. సామాన్య ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులకు ఆ అవకాశం ఇప్పించాలన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ముందుకు కదులుతున్నారు. త్వరలో తెలంగాణలో యాత్ర మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాహుల్ యాత్ర విషయంలో స్థానిక నాయకులకు కీలక ఆదేశాలిచ్చారు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్. నాయకులెవరూ జోడో యాత్రలో రాహుల్ ని కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. సామాన్య ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో రాహుల్ యాత్రలో పాల్గొనేలా చేయాలని, రాహుల్ వారిని కలిసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా రాహుల్ ని కలిసే వీలుంటుందని, కానీ ఉద్యమకారులకు నేరుగా ఆయన్ను కలిసే అవకాశం ఇప్పించగలిగితే యాత్రకు సార్థకత చేకూరుతుందని చెప్పారు.
పబ్లిసిటీ పెరగాలి..
ఓవైపు జోడో యాత్ర, మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక. ఈ రెండిటితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలమునకలై ఉన్నారు. దీంతో సహజంగానే జోడో యాత్ర పబ్లిసిటీ విషయంలో ఆయన వెనకపడ్డారని, ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు కేసీ వేణుగోపాల్. భారత్ జోడో యాత్రను పాదయాత్రలా కాదని, ఒక ఉద్యమంలా చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ యాత్ర జరిగినన్నిరోజులు రాష్ట్రం వదిలిపోవద్దని ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కి సూచించారు. మొత్తం వ్యవహారాలను రేవంత్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు.
అధికారం మనదే..
2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ కి ఎక్కువగా ఉన్నాయన్నారు కేసీ వేణుగోపాల్. దానికి తగ్గట్టుగా మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. జోడో యాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ కి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ యాత్రలో 50 వేలమందికి తక్కువ కాకుండా జనం ఉండాలని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికకు కూడా రాహుల్ యాత్ర ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. కేరళ, తమిళనాడు, కర్నాటకలో యాత్ర విజయవంతమైందని, తెలంగాణలో ఎక్కువరోజులు యాత్ర ఉన్నందున, ఇక్కడ నాయకులు మరింత ప్రచారం చేయాలని, పార్టీకి బలం చేకూరేలా ప్రయత్నించాలని సూచించారు.