Telugu Global
Telangana

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి - ఏఐసీసీ ప్రకటన‌

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ప్రకటించింది. పాల్వాయి స్రవంతి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవర్దన్ రెడ్డి కూతురు.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి - ఏఐసీసీ ప్రకటన‌
X

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసిసి అధికారికంగా ప్రకటించింది. పీసీసీ ఢిల్లీకి నాలుగు పేర్లు పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లున్నాయి. కాగా అధిష్టానం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పేరు ప్రతిష్టలుండటం, ఆ కుటుంబం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతోనే ఉండటం, స్రవంతి గతంలో పోటీ చేసి మంచి ఓట్లు సాధించడం తదితర అంశాలని అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు సర్వే నిర్వహించిన కాంగ్రెస్‌ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపు మొగ్గు చూపింది. సర్వేలతో పాటు కార్యకర్తలు నుంచి వివరాలు సేకరించింది. పాల్వాయి స్రవంతి అయితే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని కార్యకర్తల చెప్పినట్లు తెలుస్తోంది. కార్యకర్తల అభిప్రాయం, సర్వేల ఫ‌లితాల ఆధారంగా పాల్వాయి స్రవంతి వైపు అధిష్టానం మొగ్గుచూపింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి మునుగోడు నుంచి పోటీ చేశారు. పొత్తులో భాగంగా సీపీఐకి టికెట్‌ వెళ్లడంతో ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు. స్రవంతికి 27,441 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2018లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీ చేశారు. 99,329 ఓట్లు పడ్డాయి. 23వేలకు పైగా మెజార్టీ ఓట్లతో గెలుపొందారు,

కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఈసారి పాల్వాయి స్రవంతికి కృష్ణారెడ్డి పోటీ ఇచ్చారు. ఒక దశలో ఆయనకు టికెట్‌ దక్కుతుందనే ప్రచారం జరిగింది. కానీ నియోజకవర్గానికి కొత్త కావడం, కార్యకర్తలతో పూర్తి సంబంధాలు లేకపోవడం, చౌటుప్పల్‌లో మాత్రమే పట్టు ఉండడంతో కృష్ణారెడ్డికి టికెట్‌ దక్కలేదని తెలుస్తోంది.

First Published:  9 Sept 2022 1:07 PM IST
Next Story