Telugu Global
Telangana

బీఎల్ సంతో ష్ కు 'సిట్' నోటీసులివ్వడంతో.... కేసీఆర్ ధైర్యానికి దేశవ్యాప్త క్రేజ్

బీజేపీలో మూల విరాట్ లాంటి బీఎల్ సంతోష్ లాంటి వ్యక్తికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ ధైర్యానికి జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ దెబ్బతో కేసీఆర్ పేరు దేశ రాజకీయ వర్గాల్లో మారుమోగిపోతోంది. ఆయనకు గతంలో కన్నా ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది.

బీఎల్ సంతో ష్ కు సిట్ నోటీసులివ్వడంతో.... కేసీఆర్ ధైర్యానికి దేశవ్యాప్త క్రేజ్
X

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. బీజేపీ తరపున టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ లో కుట్ర చేసిన రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ లు అడ్డంగా బుక్ అవడంతో వారి ప్లాన్ తలకిందులైంది. ఆ ముగ్గురు నిందితులు అరెస్టై ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ కేసు వ్యవ‌హారం అక్కడితో ఆగలేదు. వీరి ముగ్గురిని ఈ పని కోసం నియమించింది ఎవరనే విషయం చర్చకొచ్చింది. ఈ కేసు పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు వెనక ఉన్న అన్ని విషయాలను తవ్వడం మొదలు పెట్టింది.

ఈ ముగ్గురు మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ నుండి టీఆరెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినప్పుడు చెప్పిన మాటల ఆధారం గా దీని వెనక ఉన్నది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అని తేలింది. రామచంద్ర భారతి సంతోష్ గురించి అనేక సార్లు ప్రస్తావించాడు. దాంతో సిట్ బృందం తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా సంతోష్ కు నోటీసులు జారీ చేసింది.

ఇప్పుడు ఈ వ్యవ‌హారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీలో మూల విరాట్ లాంటి బీఎల్ సంతోష్ లాంటి వ్యక్తికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ ధైర్యానికి జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ దెబ్బతో కేసీఆర్ పేరు కూడా దేశ రాజకీయ వర్గాల్లో మారుమోగిపోతోంది. ఆయనకు గతంలో కన్నా ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది. మరో వైపు సంతోష్ ను కాపాడటానికి బీజేపీ అన్ని శక్తులను ఒడ్డుతోంది. ఆయనకు నోటీసులు ఇవ్వడమే తప్పంటూ తెలంగాణ బీజేపీ నాయకులు హైకోర్టు ను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో... ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో సహా ప్రధాన నేతలందరూ ఇప్పుడు సంతోష్ ను ఈ కేసునుంచి రక్షించడంలో తలమునకలై ఉన్నారు.

ఇంత మంది రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఈ సంతోష్ ఎవరు ? బీజేపీలో మూల విరాట్ లాంటి ఆయనకు అంత పవర్ ఎలా వచ్చింది ?

బీఎల్ సంతో ష్ పూర్తి పేరు బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్ధన్ సంతోష్ . కర్నాటకకు చెందిన ఇతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)లో అతి ముఖ్యమైనవాడు. RSS ద్వారా బీజేపీలోకి ప్రవేశించిన వాడు. ఇతను బీజేపీకి ఆరెస్సెస్ కు వారధి. బీజేపీలో ఏం జరగాలన్నా అటు పుల్ల ఇటు కదలాలన్నా సంతోష్ అనుమతి అవసరమని ఆ పార్టీ వర్గాలు చెప్తుంటాయి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చాలన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్య మంత్రులను మార్చాలన్నా ఆసలా పార్టీలో ఏం జరగాలన్నా, ఆ పార్టీలో అందరూ సంతోష్ జీ అని పిల్చుకునే బీఎల్ సంతోష్ అనుమతి తప్పని సరి. చివరకు గవర్నర్ల నియామకాలు కూడా ఆయన సూచనల మేరకే జరుగుతాయన్న వాదన కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కన్నా పవర్ ఫుల్ ఈ సంతోష్. బీజేపీ మొత్తానికి నెంబర్ 1 నరేంద్ర మోడీ, నెంబర్ 2 అమిత్ షా అని బైటికి తెలిసిన విషయం కానీ వీరికి కూడా బాస్ సంతోష్ అని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. కొంచెం కష్టపడితే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల అపాయింట్ దొరకవచ్చు కానీ బీఎల్ సంతోష్ అపాయింట్ మెంట్ దొరకడం అసాధ్యం.

సంతోష్ ఎప్పుడూ బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడు. బైట కనపడడు. ఆయన కార్యకలాపాలన్ని నాలుగోడల మధ్యనే జరుగుతాయి. తన కార్యాలయంలో కూర్చొని మొత్త బీజేపీ పార్టీని తెర వెనక నుంచి నడిపిస్తాడు. సంతోష్ హై ప్రొఫైల్ వ్యక్తులను ఎప్పుడూ కలవడు. అవసరమైతే మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులే ఆయన అపాయింట్ మెంట్ తీసుకొని మరీ కలుస్తారు.

ఇంత పవర్ బీఎల్ సంతోష్ కు ఎలా వచ్చింది. దానికి కారణం ఆయన కాదు. ఆయనను ఆ పొజిషన్ లో కూర్చోబెట్టిన ఆరెస్సెస్ అసలు కారణం.

మరి ఇంతటి పవర్ ఫుల్ వ్యక్తిని ఢీకొన‌డం అంటే చిన్న విషయమా ? ఆయనతో ఢీకొట్టడం సరే కనీసం ఆయన వైపు కన్నెత్తి చూడడానికైనా ఎవరైనా సాహసిస్తారా ? ఇప్పటి వరకు దేశంలో ఎవరూ అలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఆయనతో ఢీకొట్టి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమై పోయారు. సంతోష్ తో పోరాటమంటే ఎంత మంది పవర్ ఫుల్ వ్యక్తులను,ఎంత పెద్ద వ్యవ‌స్థలను ఎదుర్కోవాలో తెలిసీ కేసీఆర్ ఈ పనికి పూనుకున్నారు.

ఎమ్మెల్యేలను కొనడానికి కుట్ర చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని ముందుగానే ప్రకటించిన కేసీఆర్ అందుకు తగ్గ చర్యలు మొదలుపెట్టారు. వానపాములు, మట్టి పాములు కాదు వేయి పడగల నాగుపామైనా సరే ఎదుర్కోవడానికి సిద్దపడ్డారు కేసీఆర్. అందుకే ఇప్పుడు జాతీయ స్థాయిలో కేసీఆర్ పేరు మార్మోగిపోతున్నది. కేసీఆర్ ధైర్యాన్నికి దేశ‌ వ్యాప్తంగా రాజకీయనాయకులు చకితులై చూస్తున్నారు.

I

First Published:  21 Nov 2022 1:21 PM IST
Next Story