హంగ్ వచ్చినా బీఆర్ఎస్‌కే లాభం..!
అక్టోబర్ 6న తెలంగాణకు వచ్చిన బీజేపీ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో హంగ్ ఏర్పడితే.. బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు తప్పదని అనేక సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హంగ్ వస్తే అది బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీతో కలవలేని కారణంగా కాంగ్రెస్‌కు పరిమితులుంటాయని.. కానీ బీఆర్ఎస్‌కు మాత్రం అటు బీజేపీ కానీ.. ఇటు కాంగ్రెస్‌ను కానీ మద్దతు కోరె వెసులుబాటు ఉంటుందంటున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ హంగ్ వచ్చిన పరిస్థితులు లేవు. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ.. 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో గానీ హంగ్ పరిస్థితులు ఏర్పడలేదు. కాగా, తాజాగా సర్వేలన్ని తెలంగాణ అసెంబ్లీలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ సర్వేలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తెలిపాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉందని, దీనివల్ల హంగ్ ఏర్పడవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి.
అక్టోబర్ 6న తెలంగాణకు వచ్చిన బీజేపీ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో హంగ్ ఏర్పడితే.. బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీ.ఎల్.సంతోష్, కేంద్రమంత్రి అమిత్ షా సమావేశమై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీకి కొద్ది దూరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆగిపోతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక MIM తన ఏడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ MIM మద్దతు కోరే అవకాశం కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక 2018లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ జేడీఎస్ మద్దతు తీసుకున్న తరహాలో.. కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ మద్దతు కోరవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్ఎస్‌కు ఎక్కువ ఆప్షన్‌లు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతు తీసుకోలేదు. ఇప్పుడు MIMతోనూ కాంగ్రెస్‌కు సత్సంబంధాలు లేవు.