Telugu Global
Telangana

పాపం..అద్దంకి.. ఈసారి కూడా హ్యాండిచ్చినట్టే..!

దయాకర్‌కు వరంగల్‌ పార్లమెంట్ స్థానం నుంచి అవకాశం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, ఇటీవలే సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్ఎస్‌ నేత పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారన్న ప్రచారం మొదలైంది.

పాపం..అద్దంకి.. ఈసారి కూడా హ్యాండిచ్చినట్టే..!
X

అద్దంకి దయాకర్‌.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత దురదృష్టవంతుడు. గడిచిన 9 ఏళ్లలో ప్రతిపక్షంలో అనేక వేదికల్లో కాంగ్రెస్‌కు గొంతుగా నిలిచాడు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినప్పటికీ అద్దంకి దయాకర్‌ భవిష్యత్ ఏంటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు దరిదాపుల్లో కనిపించట్లేదు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలనుకున్న అద్దంకి.. చివరికి పార్టీ ఆదేశాల మేరకు తుంగతుర్తి సీటును త్యాగం చేశాడు. ఆ స్థానంలో పోటీ చేసిన మందుల సామేలు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అద్దంకికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, మహేష్‌ కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది అధిష్టానం. ఇక గవర్నర్ కోటాలో కోదండరాం, మీర్ అలీ ఖాన్‌ పేర్లను సిఫార్సు చేసింది.

దయాకర్‌కు వరంగల్‌ పార్లమెంట్ స్థానం నుంచి అవకాశం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, ఇటీవలే సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్ఎస్‌ నేత పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారన్న ప్రచారం మొదలైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్‌ త్యాగం చేసిన పటేల్ రమేష్‌ రెడ్డికి కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. కానీ, కార్పొరేషన్‌ ఛైర్మన్ల జాబితాలోనూ అద్దంకికి చోటు దక్కలేదు.

ఇక అద్దంకి దయాకర్‌కు ఎలాంటి పదవులు రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా అద్దంకి చేసిన వ్యాఖ్యలతో నొచ్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. ఆయన పదవులకు అడ్డంకిగా మారారని సమాచారం.

First Published:  22 March 2024 10:57 AM IST
Next Story