Telugu Global
Telangana

బడే భాయ్‌ ఆదేశించాడు.. చోటా భాయ్‌ ఆచరించాడు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ కు తెలియకుండానే తెలంగాణలో అదానీ వ్యాపార విస్తరణ జరుగుతోందా : కేటీఆర్‌

బడే భాయ్‌ ఆదేశించాడు.. చోటా భాయ్‌ ఆచరించాడు
X

ఢిల్లీ నుంచి బడే భాయ్‌ (మోదీ) ఆదేశించాడని.. ఇక్కడ చోటా భాయ్‌ (రేవంత్‌ రెడ్డి) ఆచరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ఆదేశాలతో తెలంగాణలో అదానీ రూ.12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే రేవంత్‌ స్వాగతించారని చెప్పారు. స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం కుట్రలో భాగమేనని ఆరోపించారు. రేవంత్‌ తన ఇంట్లో అదానీతో నాలుగు గంటల పాటు సమావేశమయ్యారని, కాంగ్రెస్‌ హైకమాండ్‌ కు తెలియకుండానే తెలంగాణలో అదానీ వ్యాపార విస్తరణ జరుగుతోందా అని ప్రశ్నించారు. అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిందని, ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. అదానీపై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినా ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. అదానీ లంచాలు ఇచ్చారని అమెరికాలోని కోర్టు చెప్పిందని, గతంలో హిండెన్ బర్గ్ సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పిందని గుర్తు చేశారు.

అదానీ వివాదంతో దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారిందన్నారు. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది మధ్య తరగతి ఇన్వెస్టర్లు నష్టపోయారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా తాము రానివ్వలేదన్నారు. తమను కలిసి వ్యాపారం చేస్తామని అడిగితే చాయ్‌ తాగించి పంపామే తప్ప ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. రాహుల్‌ గాంధీ అవినీతి పరుడు అన్న అదానీకే రేవంత్‌ రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు, తమ పార్టీకి ఉన్న తేడా అదేనన్నారు. తెలంగాణ డిస్కంలను అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీలో కరెంట్‌ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలు పెట్టారని తెలిపారు. రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన విరాళం రాహుల్‌ గాంధీకి తెలిసి తీసుకున్నారా లేదా సమాధానం చెప్పాలన్నారు. జాతీయ పార్టీకి ఒక విధానం అంటూ ఉండదా అని నిలదీశారు. ఢిల్లీలో మంచివాడు కానీ అదానీ గల్లీలో ఎలా మంచివాడవుతాడని ప్రశ్నించారు.

బీజేపీది డబుల్ ఇంజన్ అని విమర్శించే కాంగ్రెస్‌ పార్టీది డబుల్ స్టాండర్డ్స్‌ కాదా అని నిలదీశారు. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్లు గుడ్ అదానీ, బ్యాడ్ అదానీ అనే విధానం పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చి ఆర్థికంగా సాయం చేస్తే గుడ్ అదానీ అంటారు. వేరే పార్టీలతో కలిసి ఉండి వ్యాపారాలు చేస్తే బ్యాడ్ అదానీ అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న కెన్యా ప్రభుత్వం ఆత్మగౌరవంతో వ్యవహారించి అదానీతో వ్యాపార సంబంధాలు రద్దు చేసుకుందని.. ఇక్కడ ఎందుకు ఆ పని చేయడం లేదో చెప్పాలన్నారు. అదానీతో ఒప్పందాలను సమీక్షించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారని, కాంగ్రెస్‌ పార్టీ విధానం అదే అయితే రాహుల్‌ గాంధీ వెంటనే రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలో ఎన్‌సీపీలో చీలకకు అదానీ కారణమని విమర్శలు చేస్తారాని, హైదరాబాద్‌ ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ లో అదానీతో మంత్రి పొంగులేటి ఎందుకు సమావేశమయ్యారో వివరణ ఇవ్వాలన్నారు. బీజేపీ వాషింగ్ మెషీన్ లో పునీతులయ్యేందుకు అదానీతో సమావేశమయ్యారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అదానీని గజదొంగ అంటాడని, హైదరాబాద్ కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతాడని.. ఇదేం విధానమని ప్రశ్నించారు.

కేసీఆర్‌ సృష్టించిన తెలంగాణ సంపదను క్రోనీ క్యాపిటలస్టులు దోచుకునేందుకు రేవంత్‌ సాయం చేస్తున్నాడని అన్నారు. అదానీపై కేసులు పెట్టాలా, అరెస్ట్‌ చేయాలా లేదా అనే దానిపై రేవంత్‌ స్పష్టత ఇవ్వాలన్నారు. రామన్నపేటలో అదానీ సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం ప్రజాభిప్రాయ సేకరణను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయని.. కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రమే నోరు విప్పలేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. అదానీ వ్యవహారంతో ఆ పార్టీల బంధం ఏ విధంగా గాఢంగా సాగుతోందో తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రిజనబుల్‌ పీరియడ్‌ లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, బాల్‌ స్పీకర్‌ కోర్టులోకే వెళ్లిందన్నారు. సీఎం ఎక్కడికి పోయినా సొల్లు పురాణం మాట్లాడుతూ ఏదేదో మొరుగుతున్నాడని, ఆయన ఎంత మొరిగినా తాము మాత్రం సబ్జెక్టే మాట్లాడతామన్నారు. తమ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు పోయి రైతులకు సమాధానం చెప్పాలన్నారు.

First Published:  22 Nov 2024 3:38 PM IST
Next Story