Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ఆక్యుజెన్ ఆర్ అండ్ డీ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం

తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఆక్యుజెన్ పరిశోధన కేంద్రం కీలకం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో ఆక్యుజెన్ ఆర్ అండ్ డీ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం
X

హైదరాబాద్‌‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ తాజాగా ఆక్యుజెన్ అనే బయోటెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆక్యుజెన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో కూడా హైదరాబాద్ హబ్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన కరోనా వ్యాక్సిన్‌లో సగానికి పైగా హైదరాబాద్ నుంచి తయారు అయ్యింది.

ఎన్నో ప్రతిష్టాత్మక బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఇక్కడ అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, మానవ వనరుల గురించి మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేశారు. దీంతో ఆక్యుజెన్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.

తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఆక్యుజెన్ పరిశోధన కేంద్రం కీలకం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆక్యుజెన్ సంస్థ ఒప్పందంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని రూ.20 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని కేటీఆర్ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ఆక్యుజెన్ నిర్ణయం కూడా కీలకంగా మారుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


First Published:  18 May 2023 7:27 PM IST
Next Story