Telugu Global
Telangana

విజయశాంతి ట్వీట్లు.. చిరంజీవి పాట్లు..

భారత మాతని అవమానిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని చెప్పారు విజయశాంతి. ఈమేరకు అమీర్ ఖాన్ ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

విజయశాంతి ట్వీట్లు.. చిరంజీవి పాట్లు..
X

భారత్ లో ఉండటం ఇబ్బందికరంగా ఉందని గతంలో వ్యాఖ్యలు చేసిన కొంతమంది ప్రముఖుల్లో అమీర్ ఖాన్ ఒకరు. అప్పట్లో ఆయన విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యారు, ఆ తర్వాత తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు కూడా. కానీ కొత్త సినిమా రిలీజైన ప్రతి సారీ ఆయనకు ఈ వివాదాలు తప్పడంలేదు. తాజాగా ఆయన కొత్త సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఈనెల 11న విడుదల కావాల్సి ఉంది. ఈ టైమ్ లో బాయ్ కాట్ అమీర్ ఖాన్ అంటూ కొంతమంది ఆ సినిమాని టార్గెట్ చేశారు. అందులో విజయశాంతి కూడా ఉన్నారు. భారత మాతని అవమానిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని చెప్పారు విజయశాంతి. ఈమేరకు అమీర్ ఖాన్ ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

మధ్యలో చిరంజీవికి ఏంటి..?

ఈ సినిమాకి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు ప్రమోషన్ అంతా చిరంజీవి పేరుమీదే జరుగుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య నటించడంతో నాగార్జున కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది కానీ, చిరంజీవి నేరుగా సమర్పకుడు అనే ట్యాగ్ తో ఉన్నారు. సో.. ఈ విమర్శలు చిరంజీవిని కూడా తాకాయి. దేశాన్ని అవమానించిన హీరో సినిమాని చిరంజీవి ప్రోత్సహించడమేంటని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు విజయశాంతి.

బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ, ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కి జనం అర్థమయ్యేలా చేస్తున్నారని అన్నారు విజయశాంతి. ఈ సినిమాకి వ్యతిరేకంగా నెటిజన్లు సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారని, దురదృష్టమేంటంటే జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోలలో పాల్గొంటున్నారని విమర్శించారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలని అన్నారు విజయశాంతి.

విజయశాంతి వ్యాఖ్యలతోపాటు, సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ పై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి చిరంజీవి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ సినిమాను సౌత్ లో ప్రమోట్ చేస్తున్న ఆయన ఇటీవలే అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీతో కలసి పాల్గొన్నారు. చిరంజీవికి ప్రధాని అంత గౌరవం ఇస్తే, ఆయన మాత్రం ప్రధానిని వేలెత్తి చూపించినవారి సినిమాలను ప్రమోట్ చేస్తున్నారని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  3 Aug 2022 8:10 AM IST
Next Story