రాహుల్ పాదయాత్రలో పూనమ్ కౌర్.. కారణం ఇదే!
నటి రాహుల్ గాంధీతో కలసి భారత్ జోడో యాత్రలో నడవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూనమ్ కౌర్ చేనేత కార్మికుల సమస్యలను రాహుల్‌కు వివరించడానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతంగా సాగుతోంది. ఇవ్వాళ మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరిన పాదయాత్ర సాయంత్రానికి జడ్చర్లకు చేరుకోనున్నది. దారి పొడవునా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి రాహుల్ గాంధీకి నీరాజనాలు అందుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారి నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
రాహుల్ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది. పవన కల్యాణ్ విషయంలో జనసేన కార్యకర్తలకు టార్గెట్‌గా మారిన పూనమ్ కౌర్ తరచుగా వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఆమె సినిమాల కంటే పీకేతో ఉండే వివాదమే ఎక్కువగా పాపులర్ చేసింది. అకస్మాతుగా ఆ నటి రాహుల్ గాంధీతో కలసి భారత్ జోడో యాత్రలో నడవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూనమ్ కౌర్ చేనేత కార్మికుల సమస్యలను రాహుల్‌కు వివరించడానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమెతో పాటు ఆల్ ఇండియా చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడు కాండగట్ల స్వామి, నాయకులు గజం అంజయ్య కూడా ఉన్నారు.
చేనేతపై ప్రభుత్వం విధించిన జీఎస్టీని ఎత్తేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు రాహుల్‌ను కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికుల సమస్యలను వివరించడానికే రాహుల్‌ను కలిశానని చెప్పారు. త్వరలో సోనియా గాంధీని కూడా కలుస్తానని తెలిపారు. మునుగోడులో చేనేత కార్మికులందరూ తమకు మంచి చేసే పార్టీకే ఓటేయాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని.. సోనియాను కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే కలవనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, త్వరలో పవన్ కల్యాణ్ తెలంగాణలో యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి పూనమ్ కౌర్‌ను తీసుకొని రావాలని సీనియర్ నాయకులు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.