ఓటీటీ చిత్రాలకూ సెన్సార్ తప్పనిసరి.. - సోషల్ మీడియాలో నటి విజయశాంతి పోస్ట్
ఓటీటీలో ప్రసారమయ్యే అసభ్యకర, అభ్యంతకర దృశ్యాలను తొలగించి.. ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటులు, నిర్మాతలకు తన పోస్ట్‌లో విజయశాంతి సూచించారు.
ఓటీటీ చిత్రాలకూ సెన్సార్ తప్పనిసరి చేయాలని సీనియర్ నటి విజయశాంతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్ పెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలన్నారు. ఇప్పటికే అనేకమంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు ఈ అంశంపై బోర్డు ముందుకు తీసుకొచ్చారని గుర్తుచేశారు.
`ఈ మధ్యే విడుదలైన ఓ తెలుగు (బహుభాషా) వెబ్ సిరీస్‌పై..` అంటూ ఆమె ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇటీవల విడుదలైన `రానా నాయుడు` వెబ్ సిరీస్‌పైనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది. బాబాయ్, అబ్బాయ్‌లు వెంకటేష్, రానా ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రధారులుగా నటించిన విషయం తెలిసిందే.
ఓటీటీలో ప్రసారమయ్యే అసభ్యకర, అభ్యంతకర దృశ్యాలను తొలగించి.. ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటులు, నిర్మాతలకు తన పోస్ట్‌లో విజయశాంతి సూచించారు. `తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా.. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నా..` అని పేర్కొన్నారు.
విజయశాంతి పోస్ట్‌పై పలువురు నెటిజన్లు కూడా స్పందిస్తూ.. ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మీరు చెప్పింది వంద శాతం నిజమని.. అవును, ఓటీటీకి సెన్సార్ ఉండాలని.. మంచి పేరున్న నటులూ ఓటీటీలో అసభ్యకర సంభాషణలు చెబుతుంటే చిరాకు వస్తోందని.. పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు.