Telugu Global
Telangana

సైబర్ క్రైమ్ విభాగానికి చేరిన అనసూయ వివాదం..

అనసూయ కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత నెటిజన్లు మరింతగా రెచ్చిపోవడంతో ఈ వివాదం మొదలైంది. అనసూయ ఈ వివాదాన్ని తేలిగ్గా వదల్లేదు. తనని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ఘాటుగా సమాధానాలిచ్చారు.

సైబర్ క్రైమ్ విభాగానికి చేరిన అనసూయ వివాదం..
X

ఒక నటి, కొంతమంది ట్రోలర్లు.. నిన్నటి వరకు ఇది ఓ ప్రైవేట్ వివాదంగానే ఉంది. కానీ ఇప్పుడిది తెలంగాణ సైబర్ క్రైమ్ అధికారుల వద్దకు చేరింది. నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని స్వీకరించిన అధికారులు విచారణ మొదలుపెట్టారు. దీంతో అనసూయ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ దేవరకొండ కొత్త సినిమా లైగర్ విడుదలైన తర్వాత అనసూయ ఓ ట్వీట్ వేశారు. అమ్మను తిట్టినవారికి తగిన శాస్తి జరిగిందని అన్నారు. అయితే గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో చెప్పిన ఓ బూతు డైలాగ్ ని దృష్టిలో ఉంచుకునే అనసూయ ఇలా కౌంటర్ ఇచ్చారని అనుకున్నారంతా. వెంటనే విజయ్ ఫ్యాన్స్ ఆంటీ అంటూ టీజింగ్ మొదలు పెట్టారు. దానికి అనసూయ కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత నెటిజన్లు మరింతగా రెచ్చిపోవడంతో ఈ వివాదం మొదలైంది. అనసూయ ఈ వివాదాన్ని తేలిగ్గా వదల్లేదు. తనని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ఘాటుగా సమాధానాలిచ్చారు. ట్రోలర్స్ కూడా ఎక్కడా తగ్గలేదు. దీంతో కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అనసూయకు మద్దతుగా మాట్లాడినవారిని కూడా ట్రోలర్స్ వదిలిపెట్టకపోవడంతో ఇదో పెద్ద వివాదంగా మారింది.

కేసు పెట్టిన అనసూయ..

తనని కామెంట్ చేసినవారిపై కేసు పెడతానంటూ రెండురోజులుగా అనసూయ చెబుతున్నా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు సరికదా ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. దీంతో ఆమె ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ని ఆశ్రయించారు. ఫిర్యాదు కాపీని, దానికి సైబర్ క్రైమ్ అధికారులు ఇచ్చిన అక్నాలడ్జ్ మెంట్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. #SayNoToOnlineAbuse, #StopAgeShaming అనే హ్యాష్‌ ట్యాగ్‌ లు పెట్టారు.

ఇండస్ట్రీనుంచి స్పందన ఏది..?

అనసూయ వివాదం కొన్నిరోజులుగా జరుగుతున్నా కూడా ఇండస్ట్రీనుంచి స్పందన లేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ ఈ వివాదంలో తలదూర్చలేదు. ఏవైపు మాట్లాడితే ఏమవుతుందో అన్న అనుమానంతో అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇతర విషయాల్లో యాక్టివ్ గా ఉండే పెద్ద నటులు, టెక్నీషియన్లు కూడా ఈ వ్యవహారానికి మాత్రం దూరంగా ఉండటం విశేషం. ఇప్పుడు సైబర్ క్రైమ్ అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  30 Aug 2022 2:18 AM GMT
Next Story