టీఎస్‌పీఎస్సీ కేసులో ట్విస్ట్.. చాట్ జీపీటీ యూజ్ చేసి ఆన్సర్లు రాసిన అభ్యర్థులు
చాట్ జీపీటీ, బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి ఏడుగురు అభ్యర్థులకు జవాబులు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో విచారణ చేపట్టిన సిట్ బృందానికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ప్రధాన నిందితులు కేవలం ప్రశ్నపత్రాలను కమిషన్ కార్యాలయం నుంచి బయటకు తెచ్చి.. అమ్మడం వరకే పరిమితం అయ్యారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా కొందరి చేత దగ్గరుండి పరీక్షలు రాయించాడు. వాళ్లకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పరీక్ష సమయంలో జవాబులు చేరవేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది.
చాట్ జీపీటీ, బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి ఏడుగురు అభ్యర్థులకు జవాబులు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలకు ఈ టెక్నాలజీ ద్వారా జవాబులు రాసినట్లు తెలిసింది. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పెద్దపల్లిలో డివిజన్ ఇంజనీర్‌గా పని చేస్తున్న పూల రమేశ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఈ వ్యవహారంలో మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. మూడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇతడికి అందాయని.. వాటిలో రెండు పరీక్షలకు సంబంధించిన జవాబులను అభ్యర్థులకు రియల్‌టైంలో అందించాడని తెలుస్తున్నది.
పూల్ రమేశ్ ముందుగానే ఏడుగురు అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 26న జరిగిన ఏఈఈ, డీఏవో పరీక్షలకు సంబంధించిన జవాబులు అతడు రియల్ టైంలో అందించాడు. సదరు అభ్యర్థుల చెవుల్లో మినీ బ్లూటూత్ రిసీవర్లు పెట్టాడు. ఒక పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్ వద్ద నుంచి ఎగ్జామ్ మొదలైన 10 నిమిషాలకు వాట్సప్ ద్వారా ప్రశ్నపత్రాన్ని తెప్పించుకున్నాడు. ఆ తర్వాత రమేశ్, అతని సహాయంగా మరో నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చొని చాట్ జీపీటీ ద్వారా ఆన్సర్లు తెలుసుకున్నారు. వాటిని పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు బ్లూటూత్ ద్వారా తెలియజేశారు. ఆ ఏడుగురు అభ్యర్థులు కలిసి రూ.40 లక్షలు పూల రమేశ్‌కు అందజేసినట్లు సిట్ అధికారులు తేల్చారు.
కాగా, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష కోసం చాట్ జీపీటీ, బ్లూటూత్ టెక్నాలజీని వాడలేదు. ఎందుకంటే పూల రమేశ్‌కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న పూల రవి కిషోర్ నుంచి ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే అందింది. దీంతో రమేశ్ ఆ ప్రశ్నపత్రాన్ని 30 మంది అభ్యర్థులకు అమ్మేశాడు. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలకు అమ్మినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.
రూ.10 కోట్ల టార్గెట్..
డీఈ పూల రమేశ్ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల అమ్మకం, జవాబుల చేరవేత ద్వారా రూ.10 కోట్ల వరకు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 35 మంది అభ్యర్థులు, కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్షలకు సంబంధించి సహాయం చేస్తానని ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. మార్చిలో టీఎస్‌పీఎస్సీ స్కామ్ బయటపడే సమయానికే పూల రమేశ్ రూ.1.10 కోట్లు సంపాదించాడు. ఒక వేళ లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉంటే రమేశ్ తన టార్గెట్ చేరుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు పూల రమేశ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నది.