హైదరాబాద్‌లో ఆ 7 ప్రాంతాలు.. నిప్పుల గుండాలే !
హైదరాబాద్ ఒకప్పుడు పెద్ద పెద్ద చెట్లతో ఎంతో చల్లగా ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వేల ఎకరాల్లో భారీ వృక్షాలు నగర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుండేవి.
హైదరాబాద్ అంటే మలయమారుతం.. హైదరాబాద్ అంటే వేసవిలో కూడా చల్లదనం.. కానీ అదంతా పాత ముచ్చట. ఇప్పుడు భాగ్యనగరంలోనూ ఎండ మలమల మాడ్చేస్తోంది. ఏసీ ఆపితే బతకలేకపోతున్నామని జనం గగ్గోలు పెడుతున్నారు. అలాంటి ఎండకు నిదర్శనం హైదరాబాద్‌లోని అర్బన్ ల్యాబ్స్ తాజా పరిశోధన నివేదిక. హైదరాబాద్‌లో ఏడు ప్రాంతాల్లో నేల మీద నిలబడలేనంత ఉష్ణోగ్రత నమోదయిందని ఆ రిపోర్ట్‌లో వెల్లడించారు.
అర్బన్ హీట్ ఐల్యాండ్స్
హైదరాబాద్ అంతా ఎండ వేడికి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయన్న పరిశోధన నివేదిక ముఖ్యంగా ఏడు ప్రాంతాల్లో నిలబడలేనంత వేడి పుడుతోందని హెచ్చరించింది. వీటిని అర్బన్ హీట్ ఐల్యాండ్స్‌గా పేర్కొంది. భూ ఉపగ్రహంతోపాటు గూగుల్ ఎర్త్‌లోని ఉష్ణోగ్రతలను పరిశీలించగా మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్‌రెడ్డి నగర్, మన్సూరాబాద్, పటాన్‌చెరు, బండ్లగూడ, హయత్‌నగర్, గచ్చిబౌలిల్లో నేల మీద నిలబడలేనంత వేడి కనిపించిందని చెప్పింది. అక్కడ 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నట్లు కనిపించిందని చెప్పింది.
మేలుకోకుంటే కష్టం
హైదరాబాద్ ఒకప్పుడు పెద్ద పెద్ద చెట్లతో ఎంతో చల్లగా ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వేల ఎకరాల్లో భారీ వృక్షాలు నగర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుండేవి. ఇప్పుడు ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేసి భవనాలు, రోడ్లు నిర్మించడం, వాహన కాలుష్యంతో వేడి సెగలు పుడుతోంది. ఇప్పటికైనా మేల్కొని చెట్ల పెంపకాన్ని పెద్ద స్థాయిలో చేపట్టకపోతే ఈ హీట్ ఐల్యాండ్స్ నగరమంతా విస్తరించే ప్రమాదం ఉందని అర్బన ల్యాబ్స్ రిపోర్ట్ హెచ్చరించింది.