రేపటి నుంచే నామినేషన్లు.. టికెట్లు కన్ఫర్మ్ కానిచోట ఆశావహుల్లో టెన్షన్
ఉదయం 11 గంటలకు ఈ క్రతువు మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అన్ని పనిదినాల్లోనూ ఇవే వేళలు వర్తిస్తాయి. వారం రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం మరో కీలక ఘట్టానికి చేరుకోబోతోంది. ఇప్పటికే పార్టీలన్నీ సుడిగాలి ప్రచారం చేస్తుండగా రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. నవంబర్ 3(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఈ క్రతువు మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అన్ని పనిదినాల్లోనూ ఇవే వేళలు వర్తిస్తాయి. వారం రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీ అంటే వచ్చే శుక్రవారం సాయంత్రం వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.
ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఫారాలు కూడా ఇచ్చేశాయి. ఇప్పుడు అభ్యర్థులు వెళ్లి ఆయా పార్టీల తరఫున నామినేషన్లు వేస్తే ఇక వారి అభ్యర్థిత్వానికి అధికారిక ముద్ర పడినట్లే. నామినేషన్లన్నీ వచ్చాక, వాటిని పరిశీలించి, ఉపసంహరణలకూ అవకాశమిచ్చి మిగిలిన అభ్యర్థులతో అభ్యర్థుల జాబితా తయారు చేస్తారు.
ఆ రెండు పార్టీలకు ఇంకా తేలని అభ్యర్థులు
119 స్థానాలున్న తెలంగాణ శాసనసభకు అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే 117 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులు ఖరారు కాలేదు. నామినేషన్ల ముందు బీజేపీ తాజాగా 35 మందితో మూడో జాబితా ప్రకటించింది. ఇంకా 31 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. కాంగ్రెస్ రెండు జాబితాల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకో 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ రోజు ఏ క్షణమైనా జాబితా రావచ్చంటున్నారు.. నామినేషన్ల టైమ్ వచ్చేసినా కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్‌కాకపోవంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.