Telugu Global
Telangana

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లేకపోయినా ఆరోగ్యశ్రీ..!

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిమితిని ఇటీవలే రూ.10లక్షలకు పెంచారు. దీంతో చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి రేషన్ కార్డులకోసం దరఖాస్తులు చేశారు.

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లేకపోయినా ఆరోగ్యశ్రీ..!
X

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి. అయితే తెలంగాణలో మాత్రం ఈ నిబంధన సడలించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి అనే నిబంధన సడలించాలన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పారాయన.


ఎందుకంటే..?

రేషన్ కార్డ్ ద్వారా ఆరోగ్యశ్రీనే కాదు, అనేక ఇతర అదనపు ప్రయోజనాలుంటాయి. అందుకే చాలామంది అనర్హులైనా కూడా ఏదో ఒక మార్గంలో రేషన్ కార్డ్ సాధించాలని అనుకుంటారు. ఇటీవల కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పుణ్యమా అని తెలంగాణలో రేషన్ కార్డులకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. అదే సమయంలో అనర్హుల కార్డులు ఏరివేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దశలో ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డ్ తో లింకు లేకుండా ఉంటే.. చాలామంది కార్డుల జోలికి వెళ్లరనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిమితిని ఇటీవలే రూ.10లక్షలకు పెంచారు. దీంతో చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి రేషన్ కార్డులకోసం దరఖాస్తులు చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ నిబంధనను సడలించబోతున్నారు. కేవలం ఆరోగ్యశ్రీకోసమే అయితే రేషన్ కార్డ్ అవసరం లేదు అనే విషయంపై అధికారులు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతో రేషన్ కార్డులు తీసుకోవాలనుకునేవారి సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.

డిజిటల్ కార్డ్ లు..

తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యునిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని కూడా ఆదేశించారు రేవంత్ రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

First Published:  30 Jan 2024 8:04 AM IST
Next Story