ఆరా సర్వేపై ఆగమాగం! చేరికల కోసం కమలం వ్యూహమా?
ఈ సర్వేపై కాంగ్రెస్ మండిపడింది. ఆరా మస్తాన్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అని.. ఆయన ఎప్పటినుంచో బీజేపీకి పని చేస్తున్నారని ఫొటోలు విడుదల చేశారు.
తెలంగాణ పాలిటిక్స్‌లో ఆరా సర్వే కాక రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ దే ఆధిక్యమంటూ ఆరా సర్వేపై రాజకీయ మంటలు రేగుతున్నాయి.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై మూడు విడతల్లో సర్వే చేశామని ఆరా సంస్థ తెలిపింది. 40 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు వివరించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు, బీజేపీకి 30.48 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఇతరులకు 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు ఆరా మస్తాన్. టీఆర్‌ఎస్‌కు 87 చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నారని, 53 చోట్ల కాంగ్రెస్‌కు, 29 చోట్ల బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని వివరించారు. ఆంధ్రా ఓటర్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆరా సర్వే తేల్చింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు ఫైట్ మధ్య.. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు, బీజేపీకి డైరెక్ట్ ఫైట్ ఉందనేది ఆరా సర్వే రిపోర్ట్. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో త్రిముఖ పోరు జరుగుతుందని అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16 చోట్ల కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందన్నారు.
అయితే ఈ సర్వేపై కాంగ్రెస్ మండిపడింది. ఆరా మస్తాన్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అని.. ఆయన ఎప్పటినుంచో బీజేపీకి పని చేస్తున్నారని ఫొటోలు విడుదల చేశారు. టీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చినప్పుడు.. ఆయన కమలం కండువా కప్పుకునేందుకు క్రియాశీలకంగా పనిచేశారని చెబుతున్నారు. తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్‌తో కలిసి పార్టీ వ్యూహ సమావేశాల్లో పాల్గొన్నారని ఆరోపిస్తున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైప్ తీసుకొచ్చారు. బలవంతం మీద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీలో చేరారు. కానీ ఇతరులు ఎవరూ నాంపల్లి బీజేపీ ఆఫీస్ వైపు రావడంలేదు. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచేందుకు బీజేపీ ఈ సర్వే ఎత్తుగడ వేసిందనేది కాంగ్రెస్ నేతల మాట. ఇటు టీఆర్‌ఎస్ నేతలు కూడా ఈ సర్వేను విశ్వసించడం లేదు. ఆరా మస్తాన్ కావాలనే నెంబర్స్ మ్యాజిక్ చేశారని మండిపడుతోంది. ఈ నెలాఖరులో తమ సర్వే వివరాలు ప్రకటిస్తామని చెబుతోంది.