ఏ1 బండి సంజయ్.. టెన్త్ పేపర్ లీక్ కేసులో వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ
టెన్త్ పేపర్ లీక్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వివరించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కార్యకర్త ప్రశాంత్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు సీపీ చెప్పారు.
పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రాన్ని ఔట్ చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హన్మకొండ జిల్లా కమలాపూర్ పాఠశాల నుంచి పేపర్ లీక్ చేయడానికి కర్త, కర్మ, క్రియ బండి సంజయే అని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఇక ప్రశ్నపత్రాన్ని సర్క్యులేట్ చేసిన బీజేపీ కార్యకర్త ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు.
టెన్త్ పేపర్ లీక్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వివరించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కార్యకర్త ప్రశాంత్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు సీపీ చెప్పారు. సోమవారం సాయంత్రం నుంచే వారిద్దరూ వాట్సప్ చాట్, కాల్స్ ద్వారా సంప్రదించుకున్నారని.. ఆ తర్వాతే హిందీ పేపర్ లీకేజీకి కుట్ర చేశారని సీపీ వెల్లడించారు. ఇప్పటికే బండి సంజయ్‌ను జడ్జి ఎదుట హాజరుపరిచినట్లు సీపీ పేర్కొన్నారు. లీక్ కేసులో సూత్రధారులు కాబట్టే సంజయ్‌ను ఏ1గా, ప్రశాంత్‌ను ఏ2గా చేర్చినట్లు చెప్పారు.
నలుగురిని అరెస్టు చేశాం..
లీకేజీ కేసులో మొత్తం 10 మంది నిందితులకు గాను నలుగురిని అరెస్టు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచే మొదటిగా హిందీ పేపర్ బయటకు వచ్చిందని.. అది అందుకున్న వెంటనే ప్రశాంత్ క్వశ్చన్ పేపర్ ఫొటో తీసి వెంటనే బండి సంజయ్‌కు ఫార్వర్డ్ చేశారని అన్నారు. ఆ తర్వాత చాలా మందికి పేపర్ ఫార్వర్డ్ అయ్యిందని సీపీ తెలిపారు.
ప్రశాంత్‌తో పాటు.. మహేశ్ అనే వ్యక్తి కూడా ఈ పేపర్‌ను చాలా మందికి పంపించారని చెప్పారు. పేపర్ అందుకున్న వారిలో ఈటల రాజేందర్, ఆయన పీఏ కూడా ఉన్నారని సీపీ వెల్లడించారు. వాట్సప్‌లో ప్రశ్నాపత్రాన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత 149 మందికి ప్రశాంత్ కాల్స్ చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కుట్రే..
తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తరుణంలో.. దీనికి అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని.. మరో పేపర్ లీక్ అయితే ప్రభుత్వం పరువు పోతుందని అంచనా వేసుకున్నారు. ఆ ఉద్దేశంతోనే బండి సంజయ్, ప్రశాంత్ పేపర్ లీక్‌కు కుట్ర చేశారని సీపీ తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్‌తో ప్రభుత్వం కుమ్మక్కై పేపర్లను లీక్ చేస్తోంది. ఐటీ మంత్రి కేటీఆరే దీనికి కారణం అంటూ ప్రెస్ మీట్‌లో మాట్లాడాలని కూడా వాట్సప్‌లో బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. తర్వాత అదే మాటలు ప్రెస్‌కు రిలీజ్ చేశారని.. యధాతథంగా పేపర్లలో వచ్చిందని సీపీ క్లిప్పింగ్స్ చూపించారు.
ఇక బండి సంజయ్ దగ్గర ఫోన్ లేదని, అడిగితే ఎక్కడో మిస్ అయ్యిందని చెప్పారని సీపీ అన్నారు. బండి సంజయ్ కనుక తన ఫోన్ ఇస్తే మరింత కీలక సమాచారం లభిస్తుందని ఆయన అన్నారు. త్వరలోనే ఫోన్ కూడా రికవరీ చేస్తామని.. అది లభిస్తే తమ పద్దతుల్లో విచారణ చేస్తామన్నారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని సీపీ వెల్లడించారు.
ఇక బండి సంజయ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని కొంత మంది బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. అన్ని న్యాయసూత్రాలను అనుసరించే అరెస్టు చేశామని.. ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని సీపీ రంగనాథ్ తెలిపారు.