రైల్లో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నం..
తీవ్ర గాయాలపాలైన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించాడో యువకుడు. ఈ ఘటనలో మహిళ రైలు నుంచి పడిపోయి తీవ్ర గాయాలపాలైంది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు మిర్యాలగూడకు మంగళవారం రాత్రి 7 గంటలకు చేరుకుంది. స్టేషన్ సమీపంలోకి వచ్చే క్రమంలో రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్–2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి తన సీటు వద్దకు వస్తుండగా డోర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్ అనే ప్రయాణికుడు ఆమెను నడుము పట్టుకొని కిందికి లాగాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించిన క్రమంలో ఆమె అతని నుంచి తప్పించుకోబోయి రైలు నుంచి కింద పడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత నిందితుడు కూడా రైలు నుంచి కిందపడిపోయాడు.
తీవ్ర గాయాలపాలైన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే ఎస్‌ఐ పవన్ కుమార్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్‌ను మరో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ అని, ఆమె ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారని సమాచారం.