ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా?
ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అని కేంద్ర మంత్రి సంజయ్ ఎక్స్ వేదికగా ఫైర్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తవుతుంది. ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో ప్రభుత్వం సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగుల అన్నం పెట్టడం విజయం, వారి చావులు ఉత్సవమని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం విజయం, వారికి సంకెళ్లేయడం ఉత్సవం, రైతులను మోసం చేయడం విజయం, వారికి ఉరితాళ్లేయడం ఉత్సవం, ఆడబిడ్డలను ఆగం చేయడం విజయం, వారి కన్నీళ్లు ఉత్సవం, ఇళ్లు ఇస్తామని మోసం చేయడం విజయం, ఉన్న ఇళ్లు కూల్చడం ఉత్సవం, రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయం, అప్పులకు నోటీసులు ఇవ్వడం ఉత్సవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అని ప్రశ్నించారు.ఇవి విజయోత్సవాలు కావు.. వికృత ఉత్సవాలు అంటూ ధ్వజమెత్తారు.