Telugu Global
Telangana

మునుగోడు సెమీ ఫైనల్.. పొత్తులు ఖరారు చేస్తుందా..?

తాజాగా తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాంను కలసి మునుగోడులో తమకు మద్దతివ్వాలని కోరింది కాంగ్రెస్. దీనిపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

మునుగోడు సెమీ ఫైనల్.. పొత్తులు ఖరారు చేస్తుందా..?
X

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన పార్టీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాణిస్తుందని, ఆ పార్టీకే అధికారం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని బీజేపీ ధీమాగా ఉన్నా, టీఆర్ఎస్ కూడా గత అనుభవాలతో రాటుదేలింది. కాంగ్రెస్ మాత్రం అటు లీడర్ పోయి, ఇటు క్యాడర్ చేజారుతుండటంతో కాస్త బేజారవుతోంది.

పొత్తులు పొడిచేనా..?

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు తప్పదని తేలిపోయింది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ తనకు తానుగా కాస్త తగ్గి బీజేపీకి మద్దతిచ్చిందని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు. అయితే మునుగోడులో అలాంటి పరిస్థితి ఉండ‌దు. మూడు పార్టీలు తమ గెలుపుకోసం కృషిచేస్తున్నాయి. మిగతా చిన్నా చితకా పార్టీల సంగతేంటనేది తేలాలి. బరిలో నిలిచి హడావిడి చేయడమా, లేక ఏదో ఒక ప్రధాన పార్టీకి మద్దతిచ్చి తమ ఉనికి కాపాడుకోవడమా.. ఈ రెండే వాటి ముందున్న మార్గాలు. తాజాగా తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాంను కలసి మునుగోడులో తమకు మద్దతివ్వాలని కోరింది కాంగ్రెస్. దీనిపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కోదండరాంతో ఉపయోగం ఎంత..? జనసమితికి ఓట్లు ఎన్ని..? అనే లెక్కలు పక్కనపెడితే.. 2023 పరిస్థితులను అంచనా వేసి కాంగ్రెస్ ముందుకెళ్తోందని అనుకోవాలి. ఇక వామపక్షాలు కూడా ఇటీవల టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చినా, లోపాయికారీగా చేతులు కలిపినా.. 2023 నాటికి వారి బంధం మరింత బలపడే అవకాశముంది. కొత్తగా అధికారంకోసం వస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ఈ ఎన్నికకు మేము కారణం కాదు.. అంటూ హుజూరాబాద్ లాగే పక్కకు తప్పుకునే అవకాశముంది.

రెబల్స్ తో బెడద..

టీఆర్ఎస్, బీజేపీ పొత్తులు లేకుండానే బరిలో దిగుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ వీలైనన్ని పార్టీలను దగ్గరకు చేర్చుకుని ఎలాగైనా ఆ సీటు కాపాడుకోవాలనుకుంటోంది. అయితే అభ్యర్థుల ఎంపికే మూడు పార్టీలకు సంకటంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ లో గ్రూపులు మొదలయ్యాయని అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ పై కూడా చాలామంది ఆశ పెట్టుకున్నారు. ఆశ నెరవేరకపోతే రెబల్ గా బరిలో దిగి పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టడం గ్యారెంటీ. బీజేపీకి రాజగోపాల్ రెడ్డే అభ్యర్థి. మొత్తమ్మీద టీఆర్ఎస్, కాంగ్రెస్ కి మాత్రం రెబల్స్ తో ఇబ్బందులు తప్పేలా లేవు. బుజ్జగింపులతో పని జరిగి, బరిలో రెబల్స్ లేకపోతే మాత్రం ముక్కోణపు పోరు ఆసక్తిగా మారుతుంది.

First Published:  17 Aug 2022 7:50 AM IST
Next Story