అసెంబ్లీకి కేసీఆర్.. స్పెషల్ ఛాంబర్ రెడీ!
బడ్జెట్ సమావేశాలు సమీపిస్తుండడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది రేవంత్ సర్కార్. మరో విశాలమైన గదిలో కేసీఆర్‌కు ఛాంబర్ ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు మరో ఛాంబర్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యూలర్‌గా ప్రతిపక్ష నేతకు కేటాయించే గదిని కాకుండా కేసీఆర్‌కు చిన్న గదిని కేటాయించింది. ఇన్నర్ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఔటర్ లాబీలోకి మార్చేసింది.
కాగా, ఈ అంశంపై గతంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడింది. కేసీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశంతోనే చిన్న గదిని కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సైతం గతంలోనే ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్.
బడ్జెట్ సమావేశాలు సమీపిస్తుండడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది రేవంత్ సర్కార్. మరో విశాలమైన గదిలో కేసీఆర్‌కు ఛాంబర్ ఏర్పాటు చేస్తోంది. అయితే కేసీఆర్ తుంటి ఆపరేషన్ కారణంగా ఇప్పటివరకూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఓ సారి అసెంబ్లీకి వచ్చారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.