Telugu Global
Telangana

కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల వేళ బీజేపీకి షాక్.... బీఆరెస్ లో చేరనున్న‌ బీజేపీ కీలక నేత

కొంత కాలంగా కేశవరెడ్డి బీఆరెస్ నాయకులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ ఎన్నికల వేళ ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే సమాచారంతో కిషన్ రెడ్డి, సంజయ్ తో సహా బీజేపీ ముఖ్యనాయకులంతా ఆయనను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.

కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల వేళ బీజేపీకి షాక్.... బీఆరెస్ లో చేరనున్న‌ బీజేపీ కీలక నేత
X

ఏప్రెల్ 30న సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి కిషన్ రె‍డ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నాయకుడు సదా కేశవరెడ్డి బీజేపికి షాక్ ఇవ్వబోతున్నారు.

కంటోన్మెంట్ ఎన్నికల నగారా మోగడంతో అప్పుడే రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ బోర్డును కైవసం చేసుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు గెలుపు కోసం తీవ్రప్రయత్నాల్లో ఉన్నారు.

కంటోన్మెంట్ ప్రాతంలో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్రం అడ్డుతగులుతున్నదని ఇప్పటికే స్థానికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ అభివృద్ది చేసేందుకు అనుమతులివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనుకున్న తెల‍గాణ ప్రభుత్వం ఈ విషయంపై కేంద్రంతో తీవ్ర పోరాటం చేస్తున్నది.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలను ఈ సారి అన్ని రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకం తీసుకున్నాయి.

అయితే స్థానికులకు బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండటమే కాకుండా ఇప్పటి వరకు బీజేపీలో ఉన్న కీలక‌ నాయకులు బీఆరెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులకు దిక్కుతోచని స్థితి నెలకొంది.

మొదటి నుంచి టీఆరెస్(ప్రస్తుతం బీఆరెస్)లో ఉన్న ఈటెల రాజేందర్ అనుచరుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి, అతని అనుచరులు ఈటెల తో పాటు బీజేపీలోకి వెళ్ళారు. అయితే అప్పటి నుంచి కూడా వారు బీజేపీలో ఇమడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా కేశవరెడ్డి బీఆరెస్ నాయకులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ ఎన్నికల వేళ ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే సమాచారంతో కిషన్ రెడ్డి, సంజయ్ తో సహా బీజేపీ ముఖ్యనాయకులంతా ఆయనను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ఆయన వినకపోవడంతో ఈ ఎన్నికల గండం ఎలా గట్టేక్కాలా అనే ఆలోచనలో పడిపోయారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో కేశవరెడ్డి మాత్రమే కాక కంటోన్మెంట్ లోని మరికొంత మంది బీజేపీ ముఖ్యనేతలు కూడా బీఆరెస్ లోకి వెళ్తున్నట్టు వారికి తెలిసి ఎలాగైనా ఎన్నికలను ఆపాలని ఎత్తుగడలు వేస్తున్నారు.

వార్డుల పునర్విభజన జరగాల్సి ఉందని, కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలని ప్రస్తుత బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు బీజేపీకి నాయకుడు రామకృష్ణ కొద్ది రోజులుగా బోర్డు సమావేశాల్లో డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ప్రత్యేక బోర్డు సమావేశంలో కూడా రామకృష్ణ అదే డిమాండ్ వినిపించడంతో బోర్డు అధికారులు ఆయనపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.... తన ముఖ్య అనుచరులు పార్టీని వీడి బీఆరెస్ లో చేరుతున్నారని తెలిసినా వారిని ఈటెల ఆపక పోవడం, వారితో మాట్లాడకపోవడం బీజేపీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈటెల రాజేందర్ కు, బండి సంజయ్ కి మధ్యన జరుగుతున్న కోల్డ్ వార్ కారణంగానే కంటోన్మెంట్ పరిణామాలను ఈటెల పట్టించుకోవడం లేదని బీజేపీలో చర్చ జరుగుతోంది.

మరో వైపు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నాయకుడు సదా కేశవరెడ్డి ఈ రోజు తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తారని భావిస్తున్నారు.

First Published:  26 Feb 2023 10:09 AM IST
Next Story