Telugu Global
Telangana

ప్రాణం తీసిన ఫోన్‌ ధ్యాస

ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో తన ఇంట్లోని పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడి నీళ్లు సిద్ధం చేయాలని హీటర్‌ పెట్టే పనిలో ఉన్నాడు. అదే సమయంలో అతనికి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

ప్రాణం తీసిన ఫోన్‌ ధ్యాస
X

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ కచ్చితంగా ఉంటోంది. సెల్‌ఫోన్‌ వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. తమకంటూ సెల్‌ఫోన్‌ లేనివారు అతి తక్కువమంది మాత్రమే ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత‌ను వినియోగించుకోవడంలో తప్పులేదు కానీ.. ఫోన్‌ ధ్యాసలో మునిగిపోయి పరిసరాలను మరచిపోతే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టవుతుంది. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. అలాంటి ఘటనే తాజాగా ఖమ్మంలో జరిగింది. ఫోన్‌ ధ్యాసలో పడి ఒక వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాల్వ ఒడ్డున ఉన్న హనుమాన్‌ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్‌బాబు (40) కుటుంబం నివసిస్తోంది. మహేశ్‌బాబు కొబ్బరికాయల వ్యాపారి. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో తన ఇంట్లోని పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడి నీళ్లు సిద్ధం చేయాలని హీటర్‌ పెట్టే పనిలో ఉన్నాడు. అదే సమయంలో అతనికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో ఫోన్‌ మాట్లాడుతూ.. అనాలోచితంగా హీటరు నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్‌ ఆన్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై కింద పడిపోయాడు.

సమీపంలోనే ఉన్న అతని తొమ్మిదేళ్ల కుమార్తె శభన్య భయంతో కేకలు వేస్తూ వెళ్లి తల్లికి చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన మహేశ్‌బాబు భార్య దుర్గాదేవి, స్థానికులు.. అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్‌బాబును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మహేశ్‌ బాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తెలిపారు. ఒకవైపు ఫోన్‌ మాట్లాడుతూ.. యథాలాపంగా మరో పని చేపట్టే అలవాటున్న వారికి ఇది కచ్చితంగా హెచ్చరిక లాంటి ఘటనే. సెల్‌ఫోన్‌ యూజర్లూ జాగ్రత్త!

First Published:  12 Aug 2024 7:04 AM GMT
Next Story