వైఎస్ షర్మిల విషయంలో తెరపైకి కొత్త ఫార్ములా.. లోక్‌సభకు పోటీ చేయాలని కాంగ్రెస్ సూచన?
వైఎస్ షర్మిల పార్టీలో చేరే విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. చేరికల విషయంలో దూకుడుగా ఉన్నది. పొంగులేటి, జూపల్లిని పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నాయకులకు ఇప్పటికీ గాలం వేస్తున్నది. ముఖ్యంగా బీజేపీలో ఉన్న తమ పాత నాయకులను వెనక్కి తిరిగి రావాలని కోరుతోంది. చేరికల విషయంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. వైఎస్ షర్మిల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్టీపీ అనే పార్టీని స్థాపించిన షర్మిల.. రెండేళ్లు కూడా కాకుండానే కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు.
వైఎస్ షర్మిల పార్టీలో చేరే విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. భట్టి, ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, వెంకట్ రెడ్డి వంటి సీనియర్లు షర్మిల కాంగ్రెస్‌లోకి రావడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం.. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. తెలంగాణలో మాత్రం రాజకీయాలు చేయవద్దని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ వద్దకు కొంత మంది సీనియర్లతో రాయబారం పంపినట్లు వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్ అధిష్టానం షర్మిల విషయంలో సానుకూలంగానే ఉన్నది. కానీ కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తున్నది. వైఎస్ షర్మిల అడిగినట్లు తెలంగాణలో రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ.. తాను కోరుకున్న అసెంబ్లీ టికెట్ మాత్రం ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. వైఎస్ షర్మిల ఎప్పటి నుంచో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అక్కడ వైఎస్ఆర్ అభిమానులు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా భారీగా ఉన్నది. అందుకే అక్కడ పోటీకి మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నారు.
పాలేరు నుంచి పోటీకి కాంగ్రెస్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఆమె పాలేరు నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే అది కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గా మారుతుందని భావిస్తోంది. ఆంధ్ర ప్రాంత నాయకురాలిని తెలంగాణ అసెంబ్లీలో కూర్చోబెట్టారనే అపవాదు కూడా మూట కట్టుకోవల్సి వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా ఆమెను తెలంగాణ నుంచి లోక్‌సభకు పంపిస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండే మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించడానికి కాంగ్రెస్ మొగ్గు చూపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని వైఎస్ షర్మిలకు చెప్పారని.. అందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ అయితే పోటీ చేస్తారని వైఎస్ షర్మిల చెప్పినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి వైఎస్ షర్మిల వైసీపీ నుంచి కూడా పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ వైఎస్ జగన్ అందుకు నిరాకరించడంతోనే ఆమె అన్నపై ఆగ్రహంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం వస్తుండటంతో అందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు సమాచారం.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు బలంగానే ఉన్నది. అంతే కాకుండా క్రిస్టియన్ ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. షర్మిలను బరిలోకి దింపితే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే సికింద్రాబాద్ మంచి ఛాయిస్ అని భావిస్తోంది. అయితే అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న అంజన్ కుమార్‌కు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉన్నది. మరి ఈ పార్ములాకు అయినా రేవంత్ వర్గం ఓకే చెప్తుందా లేదా వేచి చూడాలి.