Telugu Global
Telangana

ఎవరూ డప్పు కొట్టట్లేదు, కొట్టండి సెల్ఫ్ డబ్బా..

ఇటీవల తెలంగాణకు జల్ జీవన్ మిషన్ అవార్డు రాలేదంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ఓ వర్గం మీడియా, ఇప్పుడీ మేధావుల వ్యవహారాన్ని కూడా హైలెట్ చేస్తోంది.

ఎవరూ డప్పు కొట్టట్లేదు, కొట్టండి సెల్ఫ్ డబ్బా..
X

విమోచనమో, విలీనమో అది సెప్టెంబర్-17తో పూర్తయింది. కానీ ఇప్పటి వరకూ సగటు తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటున్నారనేది మాత్రం ఎక్కడా బయటపడలేదు. కేంద్రం పనిగట్టుకుని మరీ మంత్రుల్ని పంపించి, ఆర్మీతో కవాతు చేయిస్తే అసలు స్పందనే లేదా..? ఈ అనుమానమే ఇప్పుడు కేంద్రంలోని కొందరు పెద్దలకు వచ్చింది. అసలు తెలంగాణలో మన విన్యాసాల గురించి ఏమనుకుంటున్నారని ప్రశ్నించింది. దీంతో హడావిడి పడిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇప్పటికే లేటయింది అనుకుంటూ 75 మంది మేధావుల పేరుతో ఓ లేఖ పంపించారు. థ్యాంక్యూ మోదీజీ అంటూ రాసిన ఈ లేఖ ఢిల్లీకి చేరుకుంటే కానీ అక్కడున్నవారి ఇగో చల్లారలేదు.

ఎవరా మేధావులు.. ఏమా లేఖ..?

ఆ మేధావులెవరో ఎవరికీ తెలియదు, పోనీ తెలిసినా.. సాగర హారంలో బండి సంజయ్ పాల్గొనడం ఎంత నిజమో.. ఆ మేధావులు అసలు మేధావులనడం కూడా అంతే నిజం. అలాంటి వారంతా 75మంది పోగై మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారట. ప్రతి ఏటా ఇలాగే ఘనంగా విమోచన దినం నిర్వహించాలంటూ కోరారట. హైదరాబాద్ అమరవీరులకు సరైన గౌరవం కల్పించారంటూ స్తోత్రాలు పఠించారట. ఇదీ ఆ లేఖ సారాంశం. ఇటీవల తెలంగాణకు జల్ జీవన్ మిషన్ అవార్డు రాలేదంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ఓ వర్గం మీడియా, ఇప్పుడీ మేధావుల వ్యవహారాన్ని కూడా హైలెట్ చేస్తోంది.

దొంగలు పడ్డ ఆర్నెళ్లకు..

సెప్టెంబర్-17 పూర్త‌యి రెండు వారాలవుతోంది. క్యాలండర్ లో పేజీ కూడా మారింది. మరిప్పుడు ఈ లేఖ ఎందుకు..? శ‌భాష్ మోదీజీ అంటూ లేఖ రాయడమేంటి..? తెలంగాణ బీజేపీ నేతలు లేఖ రాశారంటే దానికి విలువ ఉండదు, పోనీ ప్రజలే లేఖ రాశారని చెబితే ఎవరూ నమ్మరు. అందుకే మధ్యలో మేధావులకు చోటిచ్చారు, వారే లేఖ రాశారంటూ 75 మంది పేర్లు లిస్ట్ లో రాసుకున్నారు బీజేపీ నేతలు.

సెప్టెంబర్-17న కేంద్రం.. తెలంగాణపై యుద్ధానికి వచ్చినట్టు మందీ మార్బలంతో వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో కవాతు చేయించింది. ఆ కార్యక్రమానికి కాషాయదండు మినహా ప్రజలెవరూ హాజరు కాలేదనేది అక్షర సత్యం. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన విలీన దినోత్సవం హైలెట్ అయింది. దీంతో కేంద్రం ఇలా లేఖ పేరుతో స్వయంతృప్తి పొందుతోంది.

First Published:  3 Oct 2022 4:15 AM GMT
Next Story