Telugu Global
Telangana

ఇంటింటి కుటుంబ సర్వే ఓట్ల కోసం కాదు

ఇష్టముంటేనే కులం, ఆధార్‌, పాన్‌ వివరాలు చెప్పొచ్చు అన్న మంత్రి పొన్నం

ఇంటింటి కుటుంబ సర్వే ఓట్ల కోసం కాదు
X

కార్తికమాసం సోమవారం సందర్బంగా మంత్రి కుటుంబ సమేతంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించగా..ఆలయ ఈవో వినోద్‌ రెడ్డి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నదన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో బీసీలకు ఎంత మేరక ప్రాధాన్యం ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేకు ప్రతి పౌరుడు సహకరించాలని మంత్రి కోరారు. ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సర్వే చేస్తున్నామన్నారు. ప్రభుత్వం బలవంతంగా ఆధార్‌, పాన్‌ వివరాలు సేకరించడం లేదని స్పష్టం చేశారు. ఇష్టముంటేనే కులం, ఆధార్‌, పాన్‌ వివరాలు చెప్పొచ్చు అన్నారు. వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఎంపిక ఉంటుందన్నారు. అలాగే కొన్నిచోట్ల సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే వార్తలపై మంత్రి స్పందించారు. ఎన్యుమరేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వేను వ్యక్తిగతంగా వాడుకున్నారని విమర్శించారు. గతంలో చేసిన సర్వే వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదన్నారు.



సియోల్‌లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ స్ఫూర్తితోనే

సియోల్‌లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ చూసిన తర్వాత స్ఫూర్తి పొంది రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని దానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. హుస్నాబాద్‌ స్టేడియం రానున్నరోజుల్లో క్రీడలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్‌లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేలా చూస్తానన్నారు.

First Published:  11 Nov 2024 9:48 AM IST
Next Story