గ్రూప్-1 మెయిన్స్‌లో కాపీ కొడుతూ పట్టుబడిన అభ్యర్థిని
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ కళాశాల లో జరిగిన ఘటన
టీజీపీఎస్సీ డొల్లతనం మరోసారి బయటపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం సీవీఆర్ కళాశాల లో అభ్యర్థిని గ్రూప్ 1 మెయిన్స్ లో కాపీయింగ్ కి పాల్పడుతూ దొరికింది. ఆమెను డిబార్ చేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.
నిరుద్యోగుల ఆందోళనలు, నిరసల తర్వాత న్యాయస్థానాల క్లియరెన్స్‌తో తెలంగాణలో మొదటిసారి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. దీనిలోభాగంగా నేడు ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష జరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్‌కు పాల్పడుతూ మహిళా అభ్యర్థిని అధికారులకు పట్టుబడింది. చీరకొంగులో చిట్టీలు తీసుకొచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా గుర్తించిన ఇన్విజిలేటర్ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. కాపీయింగ్‌కు పాల్పడిన అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థినిది మహబూబ్‌నగర్ జిల్లా, పెద్ద మందాడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామం అని తెలుస్తోంది. ఆమె ప్రభుత్వ ఉద్యోగిని అని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. అయితే కాపీయింగ్‌పై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది.