Telugu Global
Telangana

బీజేపీ అధిష్టానం నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు!

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావల్సిన సమయంలో, ఇలా అంతర్గత సమస్యలతో పార్టీ పరువును రచ్చకు ఈడ్చుతుండటంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నది.

బీజేపీ అధిష్టానం నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు!
X

తెలంగాణ బీజేపీలో ఉన్న సమస్యలపై అధిష్టానం దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర బీజేపీలో ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించి.. పార్టీని గాడిన పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో పాట, కొత్త నాయకుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలితో కొంత మంది విసిగిపోయి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావల్సిన సమయంలో, ఇలా అంతర్గత సమస్యలతో పార్టీ పరువును రచ్చకు ఈడ్చుతుండటంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నది. బండి సంజయ్‌తో విభేదాలు ఉన్నాయని భావిస్తున్న ఇద్దరు కీలక నాయకులను ఢిల్లీ రావాలని అధిష్టానం కబురు పంపింది. తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే ఢిల్లీ రావాలని సమాచారం అందింది.

రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఇంటింటికీ బీజేపీ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఈటల రాజేందర్‌తో పాటు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా డుమ్మా కొట్టారు. గత కొంత కాలంగా వీరు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇంట్లో బీజేపీకి చెందిన కీలక నాయకులు భేటీ అవ్వాలని గతంలో డిసైడ్ చేశారు. కానీ ఆఖరు నిమిషంలో ఆ సమావేశం రద్దైంది.

రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్.. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. తెలంగాణలో తాజా రాజకీయాలపై వీరిద్దరితో అమిత్ షా, జేపీ నడ్డా చర్చించే అవకాశం ఉన్నది. పార్టీలో కొనసాగడం వల్ల భవిష్యత్‌లో మంచి పదవులు ఇస్తామని వారితో రాజీ కుదిరించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో అసంతృప్త బీజేపీ నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ముందుగా రాజేందర్, రాజగోపాల్‌కు పిలపు వచ్చిందని తెలుస్తున్నది. అలాగే, ఈ నెల 25న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఈ సభను కూడా విజయవంతం చేసేలా కృషి చేయాలని వీరిద్దరినీ కోరే అవకాశం ఉన్నది.

బండి సంజయ్, ఇతరులతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. వలస నాయకులు పార్టీ బలోపేతం కోసం పని చేసేలా వీరిద్దరూ ముందుండి నడిపించాలని కూడా అధిష్టానం కోరనున్నది. ఈటల సమర్థుడైన రాజకీయ నాయకుడు, అలాగే రాజగోపాల్ పార్టీ కోసం ఖర్చు చేసే సత్తా ఉన్న వ్యక్తి. అందుకే ముందుగా వీరిద్దరికీ పిలుపు అందిందని తెలుస్తున్నది. అయితే ఈ సమావేశం అనంతరం అయినా బండి సంజయ్‌తో కలిసి పని చేస్తారా.. లేదంటే వేరే పార్టీల వైపు చూస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

First Published:  23 Jun 2023 2:04 PM IST
Next Story