కారు డోర్ అద్దంలో తల ఇరుక్కుని చిన్నారి మృతి - పెళ్లి వేడుకలో విషాదం
అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన తమ కుమార్తె ఒక్కసారిగా విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతిచెందిందంటూ మృతురాలి తండ్రి బాణోతు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి వేడుకలో ఊహించని ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కారు డోర్‌కు ఉన్న అద్దంలో నుంచి తల బయట పెట్టి పెళ్లి వేడుకలు చూస్తున్న తొమ్మిదేళ్ల చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బంధువుల పెళ్లి వేడుకలో భాగంగా.. వరుడు, వధువు ఉన్న కారు వెనుక సీటులో బాణోతు ఇంద్రజ (9) అనే చిన్నారి ఒక్కతే కూర్చుంది. ఆ సమయంలో పెళ్లి వేడుకల్లో భాగంగా చేస్తున్న డ్యాన్సులను డోర్ అద్దాల్లో నుంచి తల బయటపెట్టి ఆసక్తిగా తిలకిస్తోంది. ఆ సమయంలో చిన్నారిని గమనించని కారు డ్రైవర్ డోర్ అద్దం బటన్ నొక్కాడు. దీంతో చిన్నారి మెడ అందులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ చిన్నారి బయటికి రాలేక.. ఊపిరి అందక మృతిచెందింది.
ఈ ఘటనతో ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకలో తీవ్ర విషాదం అలుముకుంది. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన తమ కుమార్తె ఒక్కసారిగా విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతిచెందిందంటూ మృతురాలి తండ్రి బాణోతు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.