Telugu Global
Telangana

76.3 శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం మరో రికార్డు

తెలంగాణ ఏర్పడిన కొత్తలో (2014) ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతంగా ఉండేవి.

76.3 శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం మరో రికార్డు
X

తెలంగాణ సర్కారు దవాఖానాలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయి. ఇది చాలా అద్భుతమైన విషయమని, ప్రభుత్వ దవాఖానల చరిత్రలోనే సరికొత్త రికార్డని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభివర్ణించారు. ఆరోగ్య తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వైద్య రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. సర్కారు దవాఖానల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నారు. దీంతో ఇంత అద్భుతమైన ఫలితాలు చూస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలోని ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో ఆయన మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

తెలంగాణ ఏర్పడిన కొత్తలో (2014) ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతంగా ఉండేవి. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో, వైద్యారోగ్య శాఖ కృషితో తొమ్మిదేళ్లలోనే రెట్టింపు కంటే ఎక్కవ డెలివరీలు ప్రభుత్వాసుపత్రుల్లో నమోదవుతున్నాయని అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి అభినందించారు. అత్యధిక ప్రసవాలతో టాప్‌లో నిలిచిన నారాయణపేట, ములుగు, మెదక్ జిల్లాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక తక్కువ శాతం డెలివరీలు నమోదైన మంచిర్యాల, నిర్మల్, మేడ్చెల్, కరీంనగర్ జిల్లాల్లో పని తీరు మెరుగుపడాలని సూచించారు.

ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్‌లో అదరగొట్టిన మెదక్ జిల్లా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఓవరాల్ పనితీరులో చివరి స్థానంలో నిలిచిన జగిత్యాల, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పని తీరు మెరుగు పరుచుకోవాలని ఆదేశించారు. ప్రజలను రోగాల బారీ నుంచి కాపాడటంలో పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలని మంత్రి చెప్పారు.

ఓవరాల్ ర్యాంకింగ్‌లో టాప్-5 జిల్లాలు

మెదక్ - 84.4 శాతం

జోగులాంబ గద్వాల - 83.9

వికారాబాద్ - 81

ములుగు - 79

నాగర్ కర్నూల్ - ౭౭

First Published:  6 Sept 2023 6:10 AM IST
Next Story