మేడారం జాతరకు 6 వేల ఆర్టీసీ బస్సులు.. మహిళలకు ఉచితమే
ఫిబ్రవరి 18 నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఉంది.
మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను వనదేవతలు సమ్మక్క-సారలమ్మ దగ్గరకు తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కూడా సర్వం సిద్ధం చేసింది. తొలుత 4వేల బస్సులు నడపాలని నిర్ణయించారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యను మరో 50 శాతం పెంచి 6వేల బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ప్రకటించింది.
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం
ఫిబ్రవరి 18 నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ 6వేల బస్సులూ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులే ఉండనున్నాయి.
హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు
మరోవైపు సూపర్ లగ్జరీతోపాటు ఏసీ సర్వీసులు ఇంద్ర, రాజధాని బస్సులను కూడా హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల నుంచి నడిపే యోచనలో ఆర్టీసీ ఉంది. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యల్లో తరలివస్తారన్న నేపథ్యంలో ఏసీ బస్సులు కూడా వేయాలని భావిస్తున్నారు.