ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు పెండింగ్.. కుదరని సయోధ్య..!
వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట స్థానాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం కోసం సీపీఐ, వైరా కోసం సీపీఎం పట్టుబడుతున్నాయని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. మరో 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాల్లో 5 స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. రెండు విడతల్లో కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకూ ఖమ్మం, పాలేరు, మధిర, భద్రాచలం, పినపాక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.
ఇక వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట స్థానాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం కోసం సీపీఐ, వైరా కోసం సీపీఎం పట్టుబడుతున్నాయని సమాచారం. ఇక మిగిలిన మూడు స్థానాలు ఇల్లందు, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల విషయంలో పార్టీ సీనియర్లు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి మధ్య సయోధ్య కుదరట్లేదని తెలుస్తోంది.
ఆయా స్థానాల్లో ముగ్గురు నేతలు వారి అనుచరులకోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాలేరు కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు టికెట్ కేటాయించడంతో రామసహాయం మాధవిరెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వలసనేతలకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.