Telugu Global
Telangana

తెలంగాణలో రోడ్డెక్కనున్న 466 కొత్త అంబులెన్సులు.. ఆగస్టు 1న ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 466 అంబులెన్సులను ప్రవేశపెట్టనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ కొత్త వాహనాలు సిద్ధం చేసింది.

తెలంగాణలో రోడ్డెక్కనున్న 466 కొత్త అంబులెన్సులు.. ఆగస్టు 1న ప్రారంభం
X

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. కొత్త ఆసుపత్రుల నిర్మాణం, పాత వాటిని అప్ గ్రేడ్ చేయడంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్లను కూడా అందిస్తోంది. ఇక రాష్ట్రంలో 108, అమ్మఒడి అంబులెన్సు సేవలు ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి. అత్యవసర వైద్య సేవల కోసం ఎంతో మంది 108ను ఆశ్రయిస్తుంటారు. కాగా, ఇటీవల పలు అంబులెన్సులకు కాలం చెల్లడం, పాతవి మొరాయిస్తుండటంతో కొత్త వాటి కోసం ఆర్డర్ పెట్టారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 466 అంబులెన్సులను ప్రవేశపెట్టనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ కొత్త వాహనాలు సిద్ధం చేసింది. వీటిలో 108 సేవల కోసం 204 అంబులెన్సులు, అమ్మఒడి కోసం 228 వాహనాలు, 34 గ్రౌండ్ వెహికిల్స్ ఉన్నాయి. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్సులను ఉపయోగిస్తుండగా.. అమ్మఒడి వాహనాల ద్వారా గర్భిణులను సురక్షితంగా దవఖానాలకు తీసుకొని వచ్చి.. ప్రసవానంతరం ఇంటి వద్ద వదిలిపెడుతున్నారు. వీటికి ఎంతో అదరణ ఉన్నది. కొత్తగా తీసుకొని వచ్చిన 466 అంబులెన్సులు ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్రంలో అంబులెన్సుల పని తీరుపై ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాతవి, రిపేర్లకు చేరుకున్న అంబులెన్సులపై చర్చ జరిగింది. వీటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతోందని.. అప్పుడప్పుడు మార్గ మధ్యంలో ఆగిపోతున్నట్లు అధికారులు చెప్పారు. కాలం చెల్లిన అంబులెన్సులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. అధికారులు అందించిన నివేదిక ఆధారంగా కొత్త అంబులెన్సులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 426 అంబులెన్సులు 108 సేవలు అందిస్తున్నాయి. వీటిలో 175 వాహనాలను తొలగించి 204 కొత్త వాటిని ప్రవేశపెడతారు. దీంతో 108 సేవల అంబులెన్సుల సంఖ్య 455కి చేరుకోనున్నది. ఇక 102 సేవల అమ్మఒడి వాహనాలు 300 ఉండగా... వాటిలో 228 వాహనాలు తొలగించనున్నారు. వాటి స్థానంలో 288 కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులను నుంచి మృతదేహాలను తరలించే 50 వాహనాలు ఉన్నాయి. వీటిలో 34 తొలగించి.. కొత్తగా 34 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

First Published:  29 July 2023 7:53 AM GMT
Next Story