తెలంగాణలో బయల్పడ్డ 410 కోట్ల సంవత్సరాల కిందటి శిలలు
భూమి ఏర్పడ్డ తొలినాళ్ళలో వాతావరణం, భూమి స్థితిగతులు ఇప్పటికీ పూర్తిగా బహిర్గతం కాలేదు. ఆసమయంలో రసాయనిక పరిణామ క్రమం ఎలా ఉండేదన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఈ శిలలు ఉపకరించనున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు
410 కోట్ల సంవత్సరాల కిందటి శిలలు తెలంగాణలో బయల్పడ్డాయి. తెలంగాణలోని చిత్రియాల్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఈ శిలలు బయటపడ్డాయి. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా చెక్కుచెదరని ఖనిజ లవణం జిర్కోన్ కు సంబంధించిన శిలలు. ఇవి భూమి ఏర్పడిన తొలినాళ్ళవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ శిలలను వెలికి తీయడానికి కోల్ కతాకు చెందిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్ (NCESS), జపాన్ కు చెందిన హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు కృషి చేశారు.
భూమి ఏర్పడ్డ తొలినాళ్ళలో వాతావరణం, భూమి స్థితిగతులు ఇప్పటికీ పూర్తిగా బహిర్గతం కాలేదు. ఆసమయంలో రసాయనిక పరిణామ క్రమం ఎలా ఉండేదన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఈ శిలలు ఉపకరించనున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
చిత్రియాల్ లో దొరికిన శిలల కు సంబంధించిన పలు వివరాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా కరిగిన మాగ్మా పదార్థం భూమి పైభాగంలో గట్టిపడినప్పుడు స్ఫటికీకరణ చెందిన మొట్టమొదటి ఖనిజలవణాల్లో జిర్కోన్ ఒకటి. ఇది ఎంతో కఠినమైన,రసాయనికంగా స్థిరమైన ఖనిజ లవణం. అందుకే ఎటువంటి వాతావరణం కూడా దీనిపై ప్రభావం చూయించలేదు. ఇప్పుడు ఈ శిలలపై పరిశోధనలు చేయడం ద్వారా భూమి ఆవిర్భావానికి సంబంధించిన అనేక విషయాలు తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.