Telugu Global
Telangana

గాంధీభవన్‌ వద్ద 317 జీవో బాధితుల నిరసన

జీవో 317పై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌

గాంధీభవన్‌ వద్ద 317 జీవో బాధితుల నిరసన
X

హైదరాబాద్‌ గాంధీభవన్‌ వద్ద 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. గాంధీభవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యోగులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఉద్యోగులు, ఉపాధ్యాలు ఆందోళన చేశారు. గాంధీ భవన్‌ వద్దకు 317 జీవో బాధితులు భారీగా తరలివచ్చారు. జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సుమారు 27 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు మూడేళ్లుగా అరిగోస పడుతున్నామని వాపోయారు.

జీవో 317పై ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కారిస్తామని చెప్పిన విషయాన్ని నిరసన కారులు గుర్తుచేశారు.ఈ జీవోకు సంబంధించి కాంగ్రెస్‌ నాయకులు గతంలో ఇచ్చిన హామీలను నిరసనకారులు ప్లకార్డులపై ప్రదర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా తమ సమస్యను పరిష్కరించలేదని, దీనిపై కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాలోగా కాంగ్రెస్‌ ఇచ్చిన నిలబెట్టుకోవాలని కోరారు. 317 జీవోపై ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

First Published:  2 Oct 2024 1:01 PM IST
Next Story