Telugu Global
Telangana

వాటర్‌ ట్యాంకులో 30 కోతులు మృతి.. కేటీఆర్‌ ఏమన్నారంటే..?

విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నాయి. కోతులు చనిపోయిన దాదాపు 10 రోజులపైనే అయి ఉంటుందని.. అప్పటి నుంచి అదే నీటిని తాగుతున్నామని చెప్తున్నారు.

వాటర్‌ ట్యాంకులో 30 కోతులు మృతి.. కేటీఆర్‌ ఏమన్నారంటే..?
X

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలో దారుణం జరిగింది. వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. కాగా, ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు బయటకు వచ్చేందుకు దారి దొరక్క అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని బుధవారం గుర్తించిన అధికారులు.. ట్యాంకు నుంచి దాదాపు 30 కోతుల కళేబరాలను వెలికితీశారు.


ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నాయి. కోతులు చనిపోయిన దాదాపు 10 రోజులపైనే అయి ఉంటుందని.. అప్పటి నుంచి అదే నీటిని తాగుతున్నామని చెప్తున్నారు. అనారోగ్యం బారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. ట్యాంకును అధికారులు శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. 3 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో.. అనుమానంతో ట్యాంకును పరిశీలించగా కోతుల విషయం బయటపడిందన్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీరు నాగేశ్వరరావు. కోతుల కళేబరాలను తీసివేసి ట్యాంకును శుభ్రం చేయించామన్నారు. మూడు రోజులుగా నీటిని సరఫరా చేయలేదన్నారు. పూర్తి స్థాయిలో నీటిని క్లోరినేట్ చేసిన తర్వాతే వదులుతామన్నారు. 50 ఇళ్లకు మాత్రమే ఈ ట్యాంకు ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు.


ఇక ఈ ఘటనపై స్పందించారు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ మున్సిపల్ శాఖలో సిగ్గుమాలిన పరిస్థితి నెలకొందన్నారు. రెగ్యూలర్‌గా ట్యాంకులను శుభ్రపరచడం, నిర్వహణలో అనుసరించాల్సిన ప్రోటోకాల్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని..అందుకనే పాలన అస్తవ్యస్తంగా మారిందని దుయ్యబట్టారు.

First Published:  4 April 2024 8:47 AM IST
Next Story