ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ
ఆదివారం కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తమ ప్రభుత్వానికి ప్రజా పాలన అని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.
విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నది మా ఆలోచన అన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రజా పాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.