రైల్వేలో వెయిటింగ్ లిస్ట్.. వెళ్లలేకపోయినవారు కోట్లలో..
మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ ఈ ఆసక్తికర సమాచారం ఇచ్చింది. 2021-22లో అయితే 1.65 కోట్ల మంది ప్రయాణానికి నోచుకోలేకపోయారని తెలిపింది.
రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో దానికే ఎక్కువమంది ప్రయాణికులు మొగ్గు చూపుతారు. ఇక ఎక్కువ దూరం వెళ్లేవారైతే.. రైళ్లలో వెళ్లేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి అందరికీ టికెట్లు దొరుకుతాయా.. ప్రయాణం సాధ్యమవుతుందా.. అంటే మాత్రం నో అనే చెప్పాలి. సీట్లు పరిమితంగా ఉండటం, ప్రయాణికులు ఎక్కువమంది ఉండటమే దీనికి కారణం. అయినా కొంతమంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పటికీ కన్ఫామ్ అయ్యే అవకాశముంటుందనే ఆశతో ఆన్‌లైన్‌లో బుక్ చేసి ఉంచుకుంటారు. తీరా కన్ఫామ్ కాలేదని తెలియడంతో ఉసూరుమంటారు. మరి ఇలా నిరుత్సాహానికి గురైనవారు 2022-23 ఏడాదిలో ఎంతమంది ఉన్నారో తెలుసా? అక్షరాలా 2.70 కోట్ల మంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ ఈ ఆసక్తికర సమాచారం ఇచ్చింది. 2021-22లో అయితే 1.65 కోట్ల మంది ప్రయాణానికి నోచుకోలేకపోయారని తెలిపింది. 2020-21 కరోనా కాలంలో అయితే.. 65 లక్షల మంది ప్రయాణించలేకపోయారని వివరించింది. అయితే టికెట్ల రద్దయిన వారికి ఆయా మొత్తాలను ప్రయాణికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు వెల్లడించింది.
తగినన్ని రైళ్లు లేనందువల్లే..
మన దేశంలో అధిక రద్దీ ఉన్న రూట్లలో తగినన్ని రైళ్లు ఉండటం లేదనే విషయాన్ని ఈ సమాచారం వెల్లడిస్తోంది. ఈ సమస్య అధిగమించేందుకు మరిన్ని రైలు సర్వీసులు నడిపేందుకు కృషిచేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.