అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తామని.. 20మందిపై సామూహిక అత్యాచారం
ప్రాణాలకు తెగించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళలకు నిరాశే ఎదురైంది. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా.. మీవి కేవలం ఆరోపణలు మాత్రమే అన్నట్లు పోలీసులు లైట్ తీసుకున్నారు.
అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మంది మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. వివరాల్లోకి వెళితే.. సిరోలికి చెందిన మహేంద్రా మేవాడా మున్సిపల్ ఛైర్‌పర్సన్, మహేంద్ర చౌదరి మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్. వీళ్లిద్దరూ అంగన్‌వాడీలో కొలువు ఇప్పిస్తామని కొందరు మహిళలను నమ్మించారు. వారికి ఆశ్రయమిచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలా 20 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
అక్కడితో ఆగకుండా వీడియోలు తీసి విషయం బయటకు చెప్పకూడదని బాధిత మహిళలను బెదిరించారు. బయటకు చెప్తే చంపేస్తామన్నారు. బాధితుల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వారి ఆగడాలను ఎదిరించిన ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెకు మరికొందరు మహిళలు తోడుగా నిలిచారు.
ప్రాణాలకు తెగించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళలకు నిరాశే ఎదురైంది. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా.. మీవి కేవలం ఆరోపణలు మాత్రమే అన్నట్లు పోలీసులు లైట్ తీసుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.