Telugu Global
Telangana

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు..

మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు..
X

తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రేపు ఎల్లుండి (బుధ, గురు వారాలు) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈమేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. తక్షణమే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నారు కేసీఆర్.


తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల ఈనెల 20, 21, 22 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ఇచ్చారు. సోమ, మంగళ వారాల్లో విద్యాసంస్థలు యధావిధిగా ప్రారంభమైనా.. వర్షాల ధాటికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణపై ఎక్కువ ప్రభావం..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే.. రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనం వల్ల తెలంగాణపై ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. రాగల 24గంటల్లో తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజులు పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. దీంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

First Published:  25 July 2023 9:58 PM IST
Next Story