ఆ మున్సిపాలిటీలకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు : కేటీఆర్
19 మున్సిపాలిటీలకు ఒక్కోదానికి 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ 19 మున్సిపాలిటీలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్నాయి.
జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న మున్సిపాలిటీలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు.
జాతీయ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్న మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అవార్డులు అందుకున్న మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులను, అధికారులను, ఉద్యోగులను అభినందించారు. ఈ అవార్డుల సాధనలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాక అందరి శ్రమ ఉందని అన్నారు కేటీఆర్.
దేశంలోని 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని, అవార్డులు సాధించినపట్టణాల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని చెప్పిన కేటీఆర్ ఇవి నేను చెప్తున్న విషయాలు కాదు కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నదని పేర్కొన్నారు. కానీ అదే కేంద్రంలోని నాయకులు తెలంగాణలో పరిపాలన సరిగా లేదని అవాకులు చెవాకులు పేలుతుంటారని కేటీఆర్ ద్వజమెత్తారు.
కాగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్న బడంగ్‌పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్‌కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్‌పూర్, అలంపూర్, పీర్జాదిగూడ, కోరుట్ల మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రు.2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నారు. ఆ నిధులను పారిశుధ్యం కోసం వినియోగించాలని కేటీఆర్ కోరారు.