Telugu Global
Telangana

తెలంగాణలో కొత్తగా 17 బీసీ డిగ్రీ గురుకులాలు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

విద్య వల్లే వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని సీఎం కేసీఆర్ విశ్వసిస్తారు. అందు కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని మంత్రి గంగుల ప్రశంసించారు.

తెలంగాణలో కొత్తగా 17 బీసీ డిగ్రీ గురుకులాలు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
X

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్త కాలేజీలు మంజూరు చేయడంపై మంత్రి గంగుల కమలాకర్.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన కులాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు 19 బీసీ గురుకులాలే ఉండేవి. వాటిలో కూడా అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు బీసీ గురుకులాల సంఖ్య 327కు చేరుకున్నదని, ఇది కేసీఆర్ సంకల్పానికి నిదర్శనమని మంత్రి గంగుల చెప్పారు.

విద్య వల్లే వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని సీఎం కేసీఆర్ విశ్వసిస్తారు. అందు కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని మంత్రి గంగుల ప్రశంసించారు. కేవలం బీసీ గురుకులాల ద్వారానే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు.

గతేడాది 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయించుకొని.. క్లాసులు ప్రారంభించామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఆ కాలేజీల్లో 15,360 మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారని చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభించనున్న డిగ్రీ కాలేజీల వల్ల ఆ సంఖ్య 16,320కి చేరుతుందని చెప్పారు.

కొత్తగా మంజూరైన డిగ్రీ కాలేజీలను కలిపితే.. ఇప్పుడు తెలంగాణలో జిల్లాకు ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసినట్లు అవుతుందని చెప్పారు. ఈ ఏడాది జోగులాంబ గద్వాల, నారాయణ్‌పేట్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రద్రి కొత్తగూడెం, సూర్యపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

First Published:  24 Jun 2023 7:44 AM IST
Next Story